telangana
ఆర్టీసీ బస్ భవన్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) బస్ భవన్ లో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రతి ఏటా నవంబర్ 26న దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా బస్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) సిహెచ్. వెంకన్న, ఎం. రాజశేఖర్ పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఈడీ సిహెచ్. వెంకన్న మాట్లాడుతూ.. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ మౌలిక ఆదర్శాల ప్రాధాన్యతను వివరించారు. అధికారులు, ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ప్రతి సందర్భంలోనూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, రాజ్యాంగం నిర్దేశించిన విలువలను ఆచరణలో పెట్టాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు సేవలందించే క్రమంలో రాజ్యాంగ సూత్రాలు, చట్టబద్ధమైన విధానాలు, నిష్పాక్షికత, పారదర్శకత, జవాబుదారీతనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉద్యోగుల హక్కులను పరిరక్షిస్తూ రాజ్యాంగ వ్యవస్థకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను కేవలం సిద్ధాంతాలకే పరిమితం చేయకుండా పరిపాలనా నిర్ణయాల్లోనూ ఆచరణాత్మకంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను ఈ కార్యక్రమంలో అధికారులు గుర్తు చేశారు... ఈ సందర్భంగా ఈడీ వెంకన్న ఉద్యోగులందరితో భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ వేడుకల్లో సిపిఎం ఉషాదేవి, సీఎంఈ జానీరెడ్డి, సిటీఎం శ్రీదేవి, ఎస్ఎల్ఓ కిరణ్ తదితర ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.