BREAKING
కృనాల్ పాండ్యాపై బూట్లు విసిరిన ప్రేక్షకుడు: తృటిలో తప్పించుకున్న బరోడా కెప్టెన్ 32 ఏళ్లకే ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమిళనాడు మాజీ కెప్టెన్ బాబా అపరాజిత్ పొనకల్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026: సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా ఉత్తరాఖండ్‌పై ముంబై ఘన విజయం యువతలో పెరుగుతున్న రక్తంలో చక్కెర స్థాయిలతో మధ్యవయసులో జ్ఞాపకశక్తి సమస్యలు సిరికొండలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం మహిళలపై హింస నిర్మూలనకు తక్షణ చర్యలు అవసరం చెన్నై భక్తుడు తిరుమల శ్రీవారికి సమర్పించిన నగల జాబితా ఇదే.. చెడు వ్యాసాలకు బలికావోద్దు పొనకల్ ఎల్లమ్మ ఆలయం వద్ద హోమాలు పనాజీ వీధుల్లో గోవా సంస్కృతిక వైభవం ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ మృతుడి కుటుంబానికి పరామర్శ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, కీలక పోరులో భారత్-ఎ జోరు తేజాపూర్, ​శ్రీసేవ పబ్లిక్ స్కూల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత పై పోలీసుల అవగాహన

సైబరాబాద్‌ రవాణా వ్యవస్థకు కొత్త దిశ..

Select Suryaa Now
సైబరాబాద్‌ రవాణా వ్యవస్థకు కొత్త దిశ..
హైదరాబాద్‌, నవంబరు 26:వేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, పర్యావరణహిత ప్రయాణ సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం, పోలీసు శాఖ, కార్పొరేట్‌ సంస్థలు, రవాణా రంగ నిపుణులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి 'సైబరాబాద్‌ మూవ్స్‌–2026' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 26 నుంచి 28 వరకు మాదాపూర్‌లోని టీ-హబ్‌లో మూడు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది. 200 మందికి పైగా వివిధ రంగాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు.
 
తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, సైబరాబాద్‌ పోలీసు శాఖ, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్సీ), షిఫ్ట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. సైబరాబాద్‌లో ప్రస్తుతం రవాణా వ్యవస్థ ఎలా ఉంది? ట్రాఫిక్‌ రద్దీకి ప్రధాన కారణాలేమిటి? ప్రజా రవాణాను ఎలా మెరుగుపరచాలి? ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలేమిటి? అనే అంశాలపై డేటా ఆధారంగా చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నారు.
 
 * 9 లక్షల మంది ఉద్యోగులు* 
 
కార్యక్రమం ప్రాధాన్యాన్ని వివరిస్తూ సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌, ఎస్‌సీఎస్సీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎం.రమేశ్‌ మాట్లాడుతూ.. సైబరాబాద్‌లో కేవలం రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలోనే దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం అత్యంత కీలకమన్నారు. సైబరాబాద్‌ మూవ్స్‌–2026లో 113 భాగస్వామ్య సంస్థలు, 1,000 మందికి పైగా నమోదు చేసుకోవడం ఈ అంశంపై వివిధ వర్గాల్లో ఉన్న ఆసక్తికి నిదర్శనమన్నారు. నగరంలో కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధాన రూపకల్పనను పరిశీలిస్తోందని వెల్లడించారు.
 
 *ప్రజా రవాణా వినియోగం పెరగాలి* 
 
కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రయాణికుల్లో కేవలం 2 శాతం మంది మాత్రమే ప్రజా రవాణాను వినియోగిస్తుండగా, దాదాపు 82 శాతం మంది వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ కార్యాలయాలు, నివాస ప్రాంతాలను పూర్తిస్థాయిలో అనుసంధానించలేకపోవడం ఇందుకు ప్రధాన కారణమన్నారు. వీధుల మధ్య అనుసంధానం సరిగా లేకపోవడం కూడా ట్రాఫిక్‌ రద్దీ, ప్రయాణ ఆలస్యాలకు దారితీస్తోందన్నారు.
 
ట్రాఫిక్‌ నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానంతో అనేక పరిష్కారాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి విజయానికి అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరమని స్పష్టం చేశారు. కార్పొరేట్‌ సంస్థలు ముందుకొచ్చి ప్రయోగాత్మక ప్రాజెక్టులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ఇతర భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకొస్తున్న ఎస్‌సీఎస్సీ పాత్ర అభినందనీయమన్నారు.
 
 *2027 నాటికి ఉద్యోగుల వాహనాలు 10 శాతం తగ్గింపు* 
 
సైబరాబాద్‌ మూవ్స్‌ తొలిరోజు కార్యక్రమంలో భాగంగా డీజీపీ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో 15కు పైగా కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులు 'కార్పొరేట్‌ మొబిలిటీ అండ్‌ సస్టెయినబిలిటీ ప్రతిజ్ఞ' చేశారు. ఉద్యోగుల రాకపోకల కోసం వినియోగించే వ్యక్తిగత వాహనాల సంఖ్యను 2027 నాటికి 10 శాతం తగ్గించాలన్నది ఈ ప్రతిజ్ఞ ప్రధాన లక్ష్యం.
 
కార్‌పూలింగ్‌, ప్రజా రవాణా వినియోగం, చివరి మైలు అనుసంధానం, అధిక సామర్థ్యం కలిగిన వాహనాలు, సంస్థల ప్రత్యేక బస్సులు, ఇంటి నుంచి పనిచేసే విధానాలను ప్రోత్సహించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించారు. 'హాయ్‌ బోలో.. దిల్‌ ఖోలో.. నో సోలో.. సాథ్‌ చలో' అనే నినాదంతో కార్‌పూలింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
 
 *మొబిలిటీ లివింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు* 
 
ఎస్‌సీఎస్సీ, డబ్ల్యూఆర్‌ఐ ఇండియా సంస్థలు పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 'సైబరాబాద్‌ మూవ్స్‌ లివింగ్‌ ల్యాబ్‌'ను ఏర్పాటు చేయనున్నారు. ఎస్‌సీఎస్సీ ట్రాఫిక్‌ కౌన్సిల్‌, విద్యా, పరిశోధనా సంస్థలు, రవాణా నిపుణులు కలిసి పనిచేస్తారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్‌, రోడ్డు భద్రత సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. ఫలితాలను విశ్లేషించి విజయవంతమైన విధానాలను ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తారు.
 
 *పాఠశాలల మార్గాలు.. కూడళ్ల భద్రతకు మార్గదర్శకాలు* 
 
ఎస్‌సీఎస్సీ 20 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని రెండు కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. పాఠశాలలకు వెళ్లే మార్గాల్లో భద్రత పెంపు, రద్దీ కూడళ్లను సురక్షితంగా తీర్చిదిద్దడం వీటి ప్రధాన ఉద్దేశం. పాదచారులు, విద్యార్థులు, సైక్లిస్టులు, వాహనదారులందరికీ రహదారులు సురక్షితంగా ఉండేలా సూచనలు రూపొందించారు.
 
 *ప్రజల ప్రయాణ అవసరాలే ప్రామాణికం* 
 
కార్యక్రమంలో భాగంగా రవాణా వ్యవస్థకు సంబంధించిన భారీ మ్యాప్‌లు, డేటా విశ్లేషణలు, ఇంటరాక్టివ్‌ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మెట్రో మార్గాలకు సమీపంలో ఉన్న ఉద్యోగ కేంద్రాలు, కాలనీల అనుసంధానం, రోడ్డు భద్రత, ప్రజా రవాణా సదుపాయాలు తదితర అంశాలను సందర్శకులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించారు.
 
కొలంబియా రాజధాని బొగోటా మాజీ మేయర్‌ ఎన్రిక్‌ పెనలోసా మాట్లాడుతూ.. కారులో ప్రయాణించే వ్యక్తికి ఉన్న రహదారి హక్కులే సైకిల్‌పై వెళ్లేవారికీ ఉండాలని పేర్కొన్నారు. పాదచారులకు నాణ్యమైన ఫుట్‌పాత్‌లు, సమర్థమైన ప్రజా రవాణా, ప్రజలు కలుసుకునేందుకు అనువైన వీధులు నగరాలకు అవసరమన్నారు.
 
లండన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ షశి వర్మ మాట్లాడుతూ.. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరంలో పెరుగుతున్న జనసాంద్రతకు అనుగుణంగా రవాణా సదుపాయాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అధిక సామర్థ్యం కలిగిన ప్రజా రవాణా, మెరుగైన నడక మార్గాలు, పటిష్ఠమైన రహదారి అనుసంధానం కీలకమని వివరించారు.
 
 *విద్యార్థుల ఆవిష్కరణలకు ప్రోత్సాహం* 
 
మొబిలిటీ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో భాగంగా విద్యార్థులు, స్థానిక నివాసితులు రూపొందించిన వినూత్న ఆలోచనలను ప్రదర్శించారు. రాబోయే రెండు రోజుల్లో యువత, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, విద్యాసంస్థలు, హాస్పిటాలిటీ రంగ ప్రతినిధులతో చర్చలు నిర్వహించనున్నారు. ప్రజా రవాణా భవిష్యత్తు, కార్పొరేట్‌ ప్రయాణ విధానాలు, రహదారి భద్రత, గాలి నాణ్యత, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, డేటా ఆధారిత రవాణా ప్రణాళికలు వంటి అంశాలపై నిపుణులు అభిప్రాయాలు పంచుకోనున్నారు.
 
డబ్ల్యూఆర్‌ఐ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పవన్‌ ములుకుట్ల మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ రద్దీని మాత్రమే కాకుండా ప్రజలు తమ ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాలకు ఎంత సులభంగా చేరుకోగలుగుతున్నారన్న అంశాన్ని కూడా రవాణా ప్రణాళికల్లో పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. డేటా ఆధారిత విధానాలతో సైబరాబాద్‌ రవాణా వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దవచ్చన్నారు.
 
ఈ కార్యక్రమంలో డిజిపి సి వి ఆనంద్ తో పాటుగా అమెరికా కన్సలేట్ లారా విలియన్స్,  శేరిలింగం పల్లి MLA అరకపూడి గాంధీ , హైదరాబాద్ సిపి డాక్టర్ రమేష్ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సృజన,  ఎన్రిక్‌ పెనలోసా – కొలంబియాలోని బొగోటా నగర మాజీ మేయర్‌,  శశి వర్మ – లండన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సాంకేతిక విభాగం అధిపతి)., రమేశ్‌ కాజా – సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (SCSC) ప్రతినిధి,
ఆర్టీసీ, మెట్రో, mmts , పోలీస్ అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు