ఇంటి దారినీ మూసేస్తారా? హైడ్రా, ట్రాఫిక్ పోలీసులపై పోలీస్ కమిషనర్‌కు ఏడ్ల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు
తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః తమ నివాస గృహాలకు వెళ్లే ఏకైక మార్గాన్ని హైడ్రా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుంటూ తమ కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బి ఆర్ ఎస్ సీనియర్ లీడర్ ఏడ్ల సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. శివం రోడ్డులోని 6 నంబర్ ఎక్స్‌రోడ్డు నుంచి బాగ్ అంబర్‌పేట వైపు నాలుగు అడుగుల వెడల్పుతో వరదనీటి కాలువ నిర్మాణ పనులను హైడ్రా చేపడుతోందని ఆయన తెలిపారు. అయితే నిర్మాణ పనుల ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తమ కాలనీలోని నివాస గృహాలకు వెళ్లే ఏకైక మార్గాన్ని పూర్తిగా దిగ్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా సిబ్బంది, అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాలను రహదారిపై నిలిపి నివాసితుల రాకపోకలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైడ్రా, పోలీసు, కాంట్రాక్టర్ వాహనాలకు మాత్రం అదే మార్గంలో అనుమతిస్తూ, స్థానిక నివాసితుల వాహనాలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవంబర్ 25వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో తన భార్య కారులో ఇంటికి తిరిగి వస్తుండగా, అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అడ్డుకుని అవమానించారని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. కారును నిలిపివేయడంతో ఆమె వాహనం దిగి, ఒంటిపై నగలు ఉండగానే రాత్రి వేళ నడుచుకుంటూ ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉందని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని 285, 126, 127, 270 సెక్షన్ల కింద సంబంధిత హైడ్రా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎలాంటి అవమానాలు, వేధింపులు లేకుండా గౌరవంగా తమ ఇళ్లకు చేరుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నివాసితుల ప్రాథమిక రాకపోకల హక్కును కాపాడి, తమ ఇంటికి వెళ్లే ఏకైక మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు