మార్కాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్
మార్కాపురం, మేజర్‌న్యూస్ :
మార్కాపురం ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వుడా చైర్మన్ పదవిని మార్కాపురంలో అధికంగా ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించి న్యాయం చేయాలని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు ఇతర వెనుకబడిన, అణగారిన వర్గాల ప్రజలకు కూడా వారి జనాభా, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తగిన రాజకీయ అవకాశాలు, నామినేటెడ్ పదవులు కల్పించి న్యాయం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్ కూటమి ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. గత 40 సంవత్సరాలుగా మార్కాపురం మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవి ఒకే సామాజిక వర్గానికి కొనసాగుతూ వచ్చిందని, ఈసారి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య ధర్మం మేరకు ఆ పదవి మరో సామాజిక వర్గానికి కేటాయించారని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి విషయంలో జరిగిన మార్పుకు సముచిత పరిష్కారంగా, కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వుడా చైర్మన్ పదవిని ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మార్కాపురంలో ముస్లిం సామాజిక వర్గంతో పాటు ఎస్సీ ఎస్టీల జనాభా కూడా గణనీయంగా ఉందని కావున అన్ని వర్గాల అభివృద్ధిని సమన్వయం చేస్తూ వారికి కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించడం సామాజిక న్యాయానికి నిదర్శనంగా నిలుస్తుందని సుదర్శన్ అన్నారు. ముస్లిం, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు ఇతర వెనుకబడిన, అణగారిన వర్గాల ప్రజలకు కూడా వారి జనాభా, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తగిన రాజకీయ అవకాశాలు, నామినేటెడ్ పదవులు కల్పించి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన కోరారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సుదర్శన్ పేర్కొన్నారు. కొత్త జిల్లా కేంద్రంగా మార్కాపురాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి వుడా ద్వారా పట్టణ ప్రణాళిక, మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, ఉపాధి అవకాశాలు, పట్టణ విస్తరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
మార్కాపురం ప్రాంతానికి రాజకీయంగా, సామాజికంగా తగిన ప్రాధాన్యత కల్పిస్తూ వుడా చైర్మన్ పదవిని ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర వెనుకబడిన వర్గాలకు కూడా సముచిత అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వి. సుదర్శన్ కోరారు.