షాంఘై పార్టీ చీఫ్ చెన్ జినింగ్‌పై చైనా విచారణ
సూర్య అంతర్జాతీయ డెస్క్: చైనాలోని ఆర్థిక రాజధాని షాంఘై కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ మరియు అత్యున్నత పొలిట్‌బ్యూరో సభ్యుడు చెన్ జినింగ్‌పై అవినీతి నిరోధక విచారణ ప్రారంభమైనట్లు అధికారిక వార్తా సంస్థ జిన్హువా అనూహ్యంగా ప్రకటించింది. క్రమశిక్షణ, చట్టాల తీవ్ర ఉల్లంఘన ఆరోపణలపై ఆయనపై విచారణ జరుగుతోందని వెల్లడించింది. చైనా రాజకీయ వ్యవస్థలో ఈ పదబంధాన్ని సాధారణంగా అవినీతి ఆరోపణలకు సంకేతంగా భావిస్తారు. 2025 నుంచి ఇప్పటివరకు పొలిట్‌బ్యూరో సభ్యుడిపై విచారణ జరగడం ఇది నాలుగోసారి కావడం చైనా ఉన్నత రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
2022లో ఏర్పాటైన ఇరవై నాలుగు మంది సభ్యుల పొలిట్‌బ్యూరోలో చెన్ జినింగ్‌కు ముందు మరో ముగ్గురు సభ్యులపై వేటు పడింది. హీ వీడాంగ్, జాంగ్ యూక్సియా, మా జింగ్‌రుయి ఇప్పటికే తొలగింపు లేదా విచారణలను ఎదుర్కొన్నారు. తాజా పరిణామంతో పొలిట్‌బ్యూరోలో క్రియాశీల సభ్యుల సంఖ్య ఇరవై ఒక్కటికి పడిపోయింది. 1999 తర్వాత పొలిట్‌బ్యూరోలో ఇంత తక్కువ సంఖ్యలో సభ్యులు ఉండటం ఇదే తొలిసారిగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నేతృత్వంలో కొనసాగుతున్న అవినీతి వ్యతిరేక ప్రచారం మరింత ముమ్మరమవుతోందని ఈ చర్య స్పష్టం చేస్తోంది. పార్టీ అగ్రనాయకత్వంతో పాటు సైనిక ఉన్నతాధికారుల స్థాయిలోనూ వరుస చర్యలు చేపడుతుండటంతో వచ్చే ఏడాది జరగనున్న పార్టీ పునర్వ్యవస్థీకరణకు ముందు చైనా రాజకీయాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకుంటున్నాయి. షాంఘై పార్టీ చీఫ్ పదవి గతంలో పలువురు కీలక నేతలను ఉన్నత స్థానాలకు చేర్చిన నేపథ్యంలో, రెండు దశాబ్దాల కాలంలో ఆ పదవిలో ఉన్న నేతపై విచారణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అరవై రెండు ఏళ్ల చెన్ జినింగ్ పర్యావరణ ఇంజనీరింగ్‌లో శిక్షణ పొందారు. సింగువా విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, ఆ తర్వాత షాంఘై పార్టీ బాధ్యతలు చేపట్టి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులతో కీలక భేటీలు నిర్వహించారు. నవంబర్ 19న కూడా ఆయన కాస్కో షిప్పింగ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి బహిరంగంగా కనిపించారు. చెన్ జినింగ్‌పై విచారణ నిర్ణయానికి షాంఘై కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ, అవినీతిపై పోరాటంలో బీజింగ్ దృఢ సంకల్పాన్ని ఇది చాటుతోందని పేర్కొంది.