ఎర్ర సముద్ర ఓడరేవులపై సౌదీ, హౌతీల హెచ్చరికలు
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఎర్ర సముద్ర తీరంలోని కీలక ఓడరేవులపై సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి మరియు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య పరస్పర హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. వారం రోజుల్లోనే రియాద్‌లోని పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ టవర్‌పై రెండోసారి దాడి జరిగిన మరుసటి రోజే, హౌతీల నియంత్రణలో ఉన్న యెమెన్ ఓడరేవు హోదైదాపై దాడి చేస్తామంటూ సౌదీ నేతృత్వంలోని కూటమి హెచ్చరిక జారీ చేసింది. పౌరుల భద్రత దృష్ట్యా వెంటనే ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్లాలని సూచించింది. దీనికి ప్రతిగా సౌదీ కూటమి కనుక హోదైదాపై బాంబు దాడులకు దిగితే, జెడ్డాతో పాటు ఎర్ర సముద్ర తీరంలోని అన్ని సౌదీ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ప్రకటించారు. ఓడరేవుల వద్ద పనిచేసే ఉద్యోగులు, కార్మికులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, షిప్పింగ్ సంస్థలు తమ నౌకలను వెంటనే అక్కడి నుంచి తరలించాలని హౌతీలు హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, సౌదీ రాజధాని రియాద్‌లోని ఆర్థిక కేంద్ర టవర్‌పై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు సహా మొత్తం పదకొండు మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు సౌదీ పౌరులు, ఇద్దరు భారతీయులు, ముగ్గురు నేపాలీయులు మరియు నలుగురు ఈజిప్టు పౌరులు ఉన్నట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఘటన జరిగిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకుని ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాయి. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా సౌదీ నేతృత్వంలోని కూటమి అధికార ప్రతినిధి అభివర్ణిస్తూ, సంబంధిత అధికారులు ఘటనా స్థలంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారని తెలిపారు.
రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్‌పై జరిగిన ఈ దాడిని మరియు సౌదీ అరేబియాలోని పౌర, ఆర్థిక, ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి దాడులు సాధారణ పౌరుల ప్రాణాలకు తీవ్ర ముప్పు కలిగిస్తాయని, సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తాయని, ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. దాడులను తక్షణమే నిలిపివేయాలని భారత్ డిమాండ్ చేసింది.
గాయపడిన ఇద్దరు భారతీయులు మరియు వారి కుటుంబాలకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయ పౌరులు అక్కడి స్థానిక నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, భద్రతా సూచనల ప్రకారం నడుచుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. ఎర్ర సముద్రం మరియు గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు, సముద్ర రవాణాపై ఆందోళనలు నెలకొన్నాయి.