జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ మైనస్ చేసి కొత్త ఇండస్ట్రీ ఫామ్ చేశాం: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఈఎన్‌ఈ రిపీట్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ నగరానికి ఏమైంది చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి క్రేజీ గ్యాంగ్ మరోసారి తమ కామెడీ, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 19న గ్రాండ్‌గా విడుదలై హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన బ్లాక్‌బస్టర్ రిపీట్ సెలబ్రేషన్స్ వేడుకలో విశ్వక్ సేన్ చేసిన ఎమోషనల్ అండ్ ఓపెన్ స్పీచ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఈఎన్‌ఈ రిపీట్ విజయం తనకు ఎంతో రిలీఫ్‌ను ఇచ్చిందని తెలిపారు. రిలీజ్‌కు రెండు రోజుల ముందే ప్రసాద్ ల్యాబ్స్‌లో సినిమా చూసుకున్నామని, ఒకే సినిమాలో ఇన్ని అద్భుతమైన డైనమిక్స్ చూసి, తమ జీవితాన్నే తరుణ్ తెరపై ఆవిష్కరించాడని షాకయ్యానని చెప్పారు. థియేటర్ రన్ అద్భుతంగా సాగుతోందని, యూఎస్‌లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిందని, త్వరలోనే వరల్డ్‌వైడ్‌గా బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాకుండా రూ. 50 కోట్ల మార్కును టచ్ చేయబోతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో ఫస్ట్ 1 మిలియన్, ఫస్ట్ 2 మిలియన్, ఫస్ట్ రూ. 50 కోట్ల సినిమాను సృజన్, సందీప్, తరుణ్, టీమ్ అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలను కూడా విశ్వక్ సేన్ ఈ వేదికపై ఓపెన్‌గా పంచుకున్నారు. ముంబైలో ఫిల్మ్ కోర్స్ చేసిన తర్వాత 17 ఏళ్ల వయసులోనే హైదరాబాద్‌లోని కృష్ణానగర్ ఆఫీసుల చుట్టూ ఆడిషన్స్ కోసం తిరిగానని గుర్తు చేసుకున్నారు. 21 ఏళ్లు వచ్చేసరికి డబ్బులు లేవని, అప్పులు ఎక్కువ ఉన్నాయని నన్ను నమ్ముకున్న గర్ల్‌ఫ్రెండ్ కూడా వదిలేసి వెళ్లిపోయిందని తెలిపారు. ఒక సినిమాలో తనను ఫస్ట్ హీరోగా తీసుకుని, నాలుగో నెలలో నాలుగో హీరోగా మార్చారని, చెప్పకుండానే సినిమాలోంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం తెలియక 20 రోజుల పాటు పాకెట్ మనీతో అప్పు చేసి ఆఫీసుకు వెళ్లి మర్యాదలు చేశానని, తీసేశారని తెలిశాక ఇంటికెళ్లి మూడు రాత్రులు ఏడ్చానని చెప్పారు. ఎవరూ సినిమా తీయరనే కోపంతోనే 21 ఏళ్ల వయసులో ఫలక్‌నుమా దాస్ డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యానని వెల్లడించారు.
ఈ నగరానికి ఏమైంది ఆడిషన్స్ సమయంలో తనపై జరిగిన కుట్ర గురించి కూడా విశ్వక్ వివరించారు. ఫలక్‌నుమా దాస్ షూటింగ్ మరో 25 రోజుల్లో మొదలవుతుందనగా తరుణ్ ఆఫీసుకు ఆడిషన్ కోసం వెళ్లానని, ఆ కథ తన నిజ జీవితమే అనిపించి సెలెక్ట్ అయ్యానని చెప్పారు. అయితే రెండు వారాల తర్వాత తనతో పనిచేసిన ఒక అమ్మాయిలాగా ఫేక్ జీమెయిల్ ఐడీ క్రియేట్ చేసి, విశ్వక్‌ను సినిమాలో పెట్టుకుంటే మీడియాకు వెళ్లి సినిమాను డిఫేమ్ చేస్తానని తరుణ్‌కు ఈమెయిల్ పంపారని తెలిపారు. ఆ మెయిల్ చూసి తరుణ్ తీసేయాల్సి వచ్చిందని, తాను బతిమలాడటంతో నమ్మకంతో ఆ ఈమెయిల్ పంపాడని చెప్పారు. ఆరా తీస్తే కాలేజీ రోజుల్లో తాను కొట్టిన ఒక వ్యక్తి ఆడిషన్‌లో సెలెక్ట్ కాకపోవడంతో కక్షతో ఫేక్ మెయిల్ పంపాడని 24 గంటల్లోనే నిజం బయటపడిందని, ఆ రోజు తరుణ్ నమ్మకపోయి ఉంటే తన జీవితం ఏమైపోయేదో తెలియదని కృతజ్ఞతలు తెలిపారు.
ఇండస్ట్రీలో వివక్ష, సోషల్ మీడియా ట్రోల్స్‌పై మాట్లాడుతూ సినిమా వాళ్లు తప్పు చేస్తే ఊరంతా తిడుతుందని, భుజాన ఎక్కించుకునేది, పాతాళంలోకి తొక్కేసేది ప్రేక్షకులేనని, కానీ ట్రోల్స్ చూసినప్పుడు కుటుంబ సభ్యులు బాధపడతారని అన్నారు. ఇండస్ట్రీలో కూడా ఒక రెండు ఫ్లాపులు రాగానే నవ్వుతూ పలకరించిన వాళ్ల మర్యాదలు మారిపోతాయని వ్యాఖ్యానించారు. తాము ఎవ్వరం జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ నుంచి రాలేదని, తాను దిల్‌సుఖ్‌నగర్, తరుణ్ మారేడ్‌పల్లి, వివేక్ సాగర్ చిక్కడపల్లి నుంచి వచ్చామని, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్‌ను మైనస్ చేసి హైదరాబాద్ 50 కిలోమీటర్ల రేడియస్‌లో తామే కొత్త ఇండస్ట్రీని ఫామ్ చేసుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో సగం సంస్కారం తల్లిదండ్రులు, అక్క నేర్పిస్తే మిగిలిన సగం తరుణ్ దగ్గరే నేర్చుకున్నానని, తన విజయంలో సగభాగం తరుణ్‌దేనని, సృజన్, సందీప్ లాంటి నిర్మాతలు గెలిస్తే మరెంతోమంది ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ వస్తారని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.