'డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్' అందరి హృదయాలను హత్తుకుంటుంది: ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత దీపక్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తండ్రీకూతుళ్ల మధ్య ఉండే సున్నితమైన అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్. వెన్నెల సిల్వర్ స్క్రీన్ పతాకంపై డి. దీపక్ నిర్మాతగా, శరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజత్ రాఘవ్, కాజల్ చౌదరి, హాసిని సుధీర్ ప్రధాన పాత్రల్లో నటించగా బేబీ పరిణిత రుద్రరాజు కీలక పాత్ర పోషించింది. నవంబర్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత దీపక్ మాట్లాడుతూ తమ సినిమా ప్రయాణం కేబీఆర్ పార్క్ వద్ద మొదలైందని గుర్తు చేసుకున్నారు. అక్కడ హీరో రజత్ రాఘవ్‌ను కలిసినప్పుడే ఈ ప్రాజెక్ట్ ఖరారైందని, కథ వినగానే తప్పకుండా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. దర్శకుడు శరత్ కథ చెప్పిన దానికంటే ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. వినోదంతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, నిజమైన ప్రేమ ఈ చిత్రంలో ఉన్నాయని, నిర్మాతగా తనకు ఈ సినిమా మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు శరత్ మాట్లాడుతూ హీరో రజత్ తనకు ఏడేళ్లుగా మంచి స్నేహితుడని, తాను రాసే ప్రతి కథను ముందుగా ఆయనకే వినిపిస్తానని చెప్పారు. రజత్‌కు ఈ కథ బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని, అవుట్‌పుట్ విషయంలో నిర్మాత దీపక్ ఎంతో సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని తెలిపారు. నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే తండ్రి పాత్రలో నటించానని, కుటుంబ ప్రేక్షకులకు ఈ కథ బాగా నచ్చుతుందని అన్నారు.
హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ చిత్ర బృందం సమిష్టి కృషితో మంచి అవుట్‌పుట్ వచ్చిందని, ట్రైలర్ చూసిన ప్రతిసారి తాను భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తుంటారని, అయితే ఆ తప్పును సరిదిద్దుకుని ముందుకు సాగేవాడే పరిపూర్ణమైన మనిషి అనే సందేశాన్ని ఈ చిత్రంలో చూపించామని వివరించారు. బలమైన సంభాషణలు, నటీనటుల సహజ నటన, ముఖ్యంగా పతాక సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తాయని, నవంబర్ 27న విడుదలవుతున్న తమ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: కోపం మగాడి లక్షణం.. సుదర్శన్ గోవింద్ 'బీ ఏ మ్యాన్' గ్లింప్స్ ఆకట్టుకుంటోందిగా!