సంప్రదాయాలకు ప్రతీకగా చెల్లాపూర్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు
దౌల్తాబాద్, మేజర్ న్యూస్: మండల పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో తొలిసారిగా నిర్వహించిన ఈ ఉత్సవాలు ఎంతో వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. యాదవులు సంప్రదాయ దుస్తులు ధరించి, ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతులతో నిర్వహించిన ప్రదర్శనలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. సదర్ ఉత్సవాలు యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ వేడుకలు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా యాదవుల ఆత్మగౌరవం, ఐకమత్యం, సంస్కృతి, వారసత్వాన్ని చాటిచెప్పే గొప్ప పండుగ అని అన్నారు. యువత తమ సంప్రదాయాలను తెలుసుకొని, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రోజా రమేష్, ఉపసర్పంచ్ కె. శ్యామప్ప, మాజీ ఎంపీపీ పటేల్ విజయ్ కుమార్, మాజీ రైతు సమన్వయ జిల్లా సభ్యుడు ఏ. మల్లేష్, మాజీ జడ్పీటీసీ పకిరప్ప, మాజీ సర్పంచులు శరణయ్య, కిష్టమ్మ బాల్‌రాజ్, జీపీవో లింగప్ప, నాగప్ప, కోస్గి రామకృష్ణ, కానిస్టేబుళ్లు రఘు, కృష్ణ, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు దేవప్ప, ఆర్. మహేష్, పవన్ రాజు, మల్లేష్, యాదవ సంఘం నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.