జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ భారీగా ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు – సాయంత్రంలోగా ఫలితాల వెల్లడికి చర్యలు
జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్
భారీగా ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు – సాయంత్రంలోగా ఫలితాల వెల్లడికి చర్యలు
నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్)
జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సర్పంచ్ ఎన్నికలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తూ పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికే సుమారు 83 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు.
మొదటి విడతలో కావలి డివిజన్ పరిధిలో 134 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 17 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 117 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించినట్లు కలెక్టర్ వివరించారు.
దగదర్తి మండలంలోని సున్నం బట్టి, బోగోలు మండలంలోని విశ్వనాథరావుపేట, కేకేగుంట గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల రాక, ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించి, విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషకరమని అన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకే సుమారు 83 శాతం పోలింగ్ నమోదవడం ప్రజల్లో ఎన్నికల పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమని తెలిపారు.
పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా పోలింగ్ కేంద్రాల వద్దే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. లెక్కింపు పూర్తయిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు.