నెల్లూరు జిల్లాలో వర్షపాతం లోటు.. 33 మండలాల్లో తక్కువ వర్షాలు
నెల్లూరు జిల్లాలో వర్షపాతం లోటు.. 33 మండలాల్లో తక్కువ వర్షాలు
నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్ )
జిల్లాలో నవంబర్ నెలలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే గణనీయంగా తక్కువగా ఉంది. నవంబర్ 26వ తేదీ నాటికి జిల్లాలో సగటున 115.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, సాధారణ వర్షపాతం 256.9 మిల్లీమీటర్లుగా ఉంది. దీంతో 55.2 శాతం వర్షపాతం లోటు నమోదైంది.
గత మూడు రోజుల వర్షపాతం వివరాల ప్రకారం, నవంబర్ 26న జిల్లాలో సగటున 19.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కలువోయలో అత్యధికంగా 62.4 మిల్లీమీటర్లు, సీతారామపురంలో 48.4, గూడూరులో 46.8, నెల్లూరు రూరల్‌లో 42.6, దుత్తలూరులో 38.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లాలోని 36 మండలాల్లో 33 మండలాలు వర్షపాతం లోటు పరిస్థితిలో ఉండగా, మూడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గూడూరు, చిల్లకూరు, రాపూరు మండలాలు సాధారణ వర్షపాతం కేటగిరీలో ఉన్నాయి. అధిక వర్షపాతం నమోదైన మండలాలు ఏవీ లేవు. ఒక మండలంలో వర్షం నమోదు కాలేదు.
జూన్ 1 నుంచి నవంబర్ 26 వరకు జిల్లాలో మొత్తం 504.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలానికి 814.1 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉండగా, 38 శాతం లోటు నమోదైంది.
జిల్లాలో వర్షపాతం పరిస్థితి ప్రస్తుతం లోటుగా కొనసాగుతున్న నేపథ్యంలో మండలాల వారీగా వర్షాల వివరాలు అధికారిక నివేదికలో వెల్లడయ్యాయి.