ఓటు హక్కుకు రక్షణగా పోలీసు పహారా!
ఓటు హక్కుకు రక్షణగా పోలీసు పహారా!
-2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
-సమస్యాత్మక కేంద్రాలపై నిఘా.. -క్షేత్రస్థాయిలో ఎస్పీ అజిత వేజెండ్ల పర్యవేక్షణ
నెల్లూరు,అర్బన్/క్రైమ్ (మేజర్ న్యూస్):
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిర్భయంగా వినియోగించుకునేలా జిల్లా వ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.గ్రామీణ ప్రాంతాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు, పట్టణ ప్రాంతాల్లో కావలి, గూడూరు మున్సిపాలిటీలు, అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది.ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించారు.జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల స్వయంగా రంగంలోకి దిగి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు సిబ్బంది విధుల నిర్వహణ, సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకున్న ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి ఘటనలు జరిగినా వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.ఓటర్లు ఎలాంటి భయాలు, బెదిరింపులు, ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.ప్రతి ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, ఎన్నికల నిర్వహణలో ప్రజల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.భద్రతలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద సాధారణ పోలీసు బందోబస్తుతో పాటు రూట్ మొబైల్ పార్టీలు, ఎస్‌హెచ్‌ఓ మొబైల్ బృందాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను రంగంలోకి దించారు. డ్రోన్లు, వెబ్ కెమెరాల ద్వారా పోలింగ్ కేంద్రాల పరిసరాలను పర్యవేక్షిస్తున్నారు. మొబైల్ పెట్రోలింగ్ బృందాలు నిరంతరం పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నాయి.పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే కావలి, గూడూరు మున్సిపాలిటీలు, అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని మొత్తం 115 వార్డులకు గాను 18 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.మిగిలిన 97 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 101 పోలింగ్ స్టేషన్ లొకేషన్లు ఏర్పాటు చేయగా, 15 హైపర్ సెన్సిటివ్, 25 సెన్సిటివ్, 61 సాధారణ కేంద్రాలుగా వర్గీకరించారు. పట్టణ ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.గ్రామీణ ప్రాంతాల్లో అల్లూరు, బోగోలు, దగదర్తి, జలదంకి, కలిగిరి, కొండాపురం, వింజమూరు, కావలి రూరల్ మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 134 గ్రామ పంచాయతీలకు గాను 20 ఏకగ్రీవం కాగా, 114 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.1,332 వార్డుల్లో 343 ఏకగ్రీవం కాగా, మిగిలిన 989 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 340 పోలింగ్ స్టేషన్ లొకేషన్లను ఏర్పాటు చేసి, వాటిలో 74 హైపర్ సెన్సిటివ్, 69 సెన్సిటివ్, 197 సాధారణ కేంద్రాలుగా గుర్తించారు.మరో 30 సున్నితమైన గ్రామాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియనుండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది.ఎన్నికల సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా గుమిగూడవద్దని పోలీసులు సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎక్కడైనా బెదిరింపులు, ఘర్షణలు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు చోటుచేసుకుంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని జిల్లా పోలీసు శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.