తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపులపై మెరుపు దాడులు.. 138 షాపులకు షోకాజ్ నోటీసులు
హైదరాబాద్: అబార్షన్ (MTP) కిట్ల అక్రమ విక్రయాల కట్టడికి తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపులపై అధికారులు ఉక్కుపాదం మోపారు. గురువారం టీజీ సేఫ్ (TG SAFE) డ్రగ్స్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు. ట్రాన్సాక్షన్ డేటా ఆధారంగా చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీల్లో 138 మెడికల్ షాపుల్లో అబార్షన్ కిట్ల విక్రయాలకు సంబంధించి భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్, కనీస విక్రయ బిల్లులు లేకుండానే షెడ్యూల్-హెచ్ (Schedule-H) కిందకు వచ్చే మిఫెప్రిస్టోన్, మిసోప్రోస్టోల్ వంటి మందులను యథేచ్ఛగా విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. అంతేకాకుండా రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండానే మందులు ఇవ్వడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు.. ఆ 138 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన షాపుల లైసెన్సులను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎక్కడైనా అక్రమంగా అబార్షన్ కిట్లు విక్రయిస్తున్నట్లు తెలిస్తే టీజీ సేఫ్ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.