భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనం రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – కలెక్టర్ హిమాన్షు శుక్లా
భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనం
రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు కలెక్టరేట్( మేజర్ న్యూస్ )
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను గౌరవిస్తూ వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. మతాలు, భాషలు, సంస్కృతులు వేరైనా దేశ ఐక్యత, సమగ్రత కోసం భారతీయులంతా ఒక్కటిగా పనిచేయాలని ఆయన సూచించారు.
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి రాజ్యాంగ ప్రవేశికను పఠించారు. అనంతరం ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించి రాజ్యాంగ గొప్పతనం, పౌరుల హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను వివరించారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో పాటు ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛను కల్పించిందని కలెక్టర్ తెలిపారు. కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సమాన హక్కులు, అవకాశాలను అందిస్తూ దేశ ప్రజలందరినీ ఒకే రాజ్యాంగ వ్యవస్థ కింద ఏకం చేసిన గొప్ప శక్తి రాజ్యాంగమని పేర్కొన్నారు.
రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాకుండా దేశ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచే విలువల సమాహారమని వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు అందులో పేర్కొన్న ప్రాథమిక విధులను కూడా ప్రతి పౌరుడు బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు.
భారతదేశంలో విభిన్న మతాలు, భాషలు, సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ మనమంతా ఒకే దేశానికి చెందినవారమనే భావన కలిగి ఉండాలని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేక గొప్పతనమని పేర్కొంటూ, దేశభక్తి, జాతీయ సమైక్యతా భావంతో దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన్ రెడ్డి, సీపీఓ లక్ష్మీనరసింహం, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.