మహిళల స్వయం ఉపాధికి ఆరాధ్య ఫౌండేషన్ చేయూత
యాలాల, మేజర్ న్యూస్: గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ఆరాధ్య ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యాలాల మండలం గంగాసాగర్ గ్రామంలో మహిళలకు 40 శాతం సబ్సిడీతో కుట్టుమిషన్లను పంపిణీ చేయడంతో పాటు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ అందించింది. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మధులపల్లి మల్లేశం, ఉపసర్పంచ్ ఈసరి మంజుల జగన్నాథ్ హాజరై మహిళలను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో మహిళల కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కుట్టుమిషన్ల పంపిణీతో పాటు ఉచిత శిక్షణ, సర్టిఫికెట్ల అందజేత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.ఫౌండేషన్ జిల్లా ఇన్‌చార్జి నవీన యాదయ్య మాట్లాడుతూ.. మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించడమే సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. కుట్టుమిషన్ శిక్షణతో పాటు భవిష్యత్తులో బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్ వంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలు తమ నైపుణ్యాలతో సొంతంగా ఆదాయం సంపాదించుకునేలా తీర్చిదిద్దేందుకు సంస్థ కృషి చేస్తుందని వివరించారు. అర్హులైన మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ ఫౌండర్ మాధవి, సెక్రటరీ శ్రావణ్ కుమార్, జిల్లా ఇన్‌చార్జి నవీన యాదయ్య, ట్రైనర్లు పావని, సూర్యకళ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.