బిర్యానీ తినాలంటూ పరిచయం.. నిర్మానుష్య ప్రాంతంలో బెదిరించి దోపిడీ
కీసర, మేజర్ న్యూస్: బిర్యానీ తినాలంటూ వాహనదారుడితో పరిచయం పెంచుకుని, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రాణహాని తలపెడతానని బెదిరించి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ దోచుకెళ్లిన నిందితుడిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి నాలుగు తులాల బంగారు గొలుసు, బ్రేస్‌లెట్‌తో పాటు పోకో ఎఫ్27 మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం కీసర పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జవహర్‌నగర్ డివిజన్ ఏసీపీ చక్రపాణి కేసు వివరాలను వెల్లడించారు.ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23వ తేదీ తెల్లవారుజామున చక్రీపురంలోని శ్రీ రత్న హోటల్ వద్ద బాధితుడికి మహమ్మద్ మౌలానా పరిచయమయ్యాడు. బిర్యానీ తినాలంటూ మాటలు కలిపి బాధితుడి స్కూటీపై ఎక్కాడు. అనంతరం నాగారంలోని హోటల్‌లో భోజనం చేసిన ఇద్దరూ తిరిగి బయలుదేరగా, తనను దమ్మాయిగూడ వద్ద దింపాలని నిందితుడు కోరాడు. తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో దమ్మాయిగూడలోని ఐకామ్ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాక స్కూటీని ఆపించి బాధితుడిని చంపేస్తానని బెదిరించాడు. భయాందోళనకు గురైన బాధితుడి వద్ద నుంచి బంగారు గొలుసు, బ్రేస్‌లెట్, మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కొని పరారయ్యాడు.బాధితుడి ఫిర్యాదుతో కీసర పోలీసులు క్రైమ్ నంబర్ 1207/2026, బీఎన్ఎస్ సెక్షన్ 309(4) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన మహమ్మద్ మౌలానా ప్రస్తుతం మౌలాలి హెచ్‌బీ కాలనీ బక్షిగూడలో నివాసముంటూ సెంటరింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి దోపిడీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ పర్యవేక్షణలో, జోన్ డీసీపీ సీహెచ్. శ్రీధర్ మార్గదర్శకత్వంలో కేసును ఛేదించారు. ఈ దర్యాప్తులో ఏసీపీ చక్రపాణి, కీసర ఇన్‌స్పెక్టర్ ఎ. ఎలక్షన్ రెడ్డి, డీఐ ఎస్. నాగరాజు, డీఏఐ ఎన్. ఉపేందర్ యాదవ్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులకు వాహనాలపై లిఫ్ట్ ఇవ్వవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.