మసీదులో నమాజ్‌కు రాజకీయాలతో సంబంధం లేదు..
చెన్నై: మసీదులో నమాజ్ చేసే హక్కుకు, వ్యక్తిగత రాజకీయ పార్టీల అనుబంధాలకు ఎలాంటి సంబంధం లేదని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏ రాజకీయ పార్టీలో ఉన్నారనే కారణంతోనైనా మసీదులో ప్రార్థనలు చేయకుండా ఎవరినీ అడ్డుకోవడం చట్టవిరుద్ధమని జస్టిస్ వి. లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సేలంకు చెందిన బీజేపీ మైనారిటీ మోర్చా సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
మసీదుల యాజమాన్య హక్కులు అల్లాహ్‌కే ఉంటాయని, మనుషులు కేవలం నిర్వహణ బాధ్యతలు మాత్రమే చూస్తారని కోర్టు వివరించింది. మసీదులోకి ప్రవేశించే ముందే రాజకీయ అనుబంధాలను పక్కన పెట్టాలని, ఎవరు నిజమైన ముస్లిం అనే విషయాన్ని దేవుడే నిర్ణయిస్తారని, సాధారణ మనుషులు కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రార్థనలను అడ్డుకోవడం పాపమని అభిప్రాయపడిన హైకోర్టు.. మతపరమైన ప్రదేశాల్లో సమానత్వం, సామాజిక హోదా లేదా రాజకీయాలతో సంబంధం లేకుండా అందరికీ సమాన గౌరవం దక్కాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.