2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి
సూర్య జాతీయ డెస్క్: 2025–26 వ్యవసాయ సంవత్సరంలో భారతదేశంలో రికార్డు స్థాయిలో 378.538 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదైందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం వెల్లడించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 20.806 మిలియన్ టన్నులు అధికమని తుది పంట అంచనాల్లో పేర్కొన్నారు. రైతుల కృషి, ప్రభుత్వ పథకాలు, శాస్త్రీయ సాంకేతికతల తోడ్పాటుతో వ్యవసాయ రంగంలో ఈ చారిత్రక మైలురాయిని అధిగమించినట్లు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు.
వరి, పప్పుధాన్యాలు, జనపనార, సిరిధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, గోధుమ, పత్తి ఉత్పత్తిలో రెండో స్థానంలో కొనసాగుతోందని చౌహాన్ చెప్పారు. 2025–26 తుది అంచనాల ప్రకారం వరి ఉత్పత్తి 4.97 మిలియన్ టన్నులు పెరిగి 155.15 మిలియన్ టన్నులకు చేరింది. గోధుమ ఉత్పత్తి 122.06 మిలియన్ టన్నులకు, మొక్కజొన్న ఉత్పత్తి 55.03 మిలియన్ టన్నులకు చేరుకోగా, పప్పుధాన్యాల ఉత్పత్తి 27.24 మిలియన్ టన్నులుగా నమోదైంది. నూనెగింజల ఉత్పత్తి కూడా 43.26 మిలియన్ టన్నుల రికార్డు స్థాయిని తాకింది.
ఇదే సందర్భంగా 2026–27 ఖరీఫ్ సీజన్ తొలి ముందస్తు అంచనాలను కూడా మంత్రి విడుదల చేశారు. ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 167.143 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. ఇది గత ఐదేళ్ల సగటు ఖరీఫ్ ఉత్పత్తి కంటే 9.767 మిలియన్ టన్నులు ఎక్కువని అధికారులు వివరించారు. వాతావరణ సవాళ్లు, కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల ఆలస్యం, తేమ లోపం వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మెరుగైన పంట దిగుబడి అంచనాలు నిలిచాయని పేర్కొన్నారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమాచారం, రిమోట్ సెన్సింగ్, డిజిటల్ పంట సర్వేలు, పంట కోత ప్రయోగాల ఆధారంగా బహుళ దశల పరిశీలన తర్వాత ఈ అంచనాలను ఖరారు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. పప్పుధాన్యాలు, నూనెగింజల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా జాతీయ మిషన్లను వేగవంతం చేస్తున్నామని, రాబోయే సీజన్లలో రైతులకు మరింత అండగా నిలుస్తామని మంత్రి స్పష్టం చేశారు.