రాహుల్ జీ..రాజ్యాంగాన్ని ప్రదర్శించడమే కాదు..ముందుగా చదవాలి..
న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సంవిధాన్ గౌరవ్ దివస్' కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కొనియాడుతూ, రాజ్యాంగ రూపకర్తల సేవలను స్మరించుకున్నారు. రాజ్యాంగ అసలు ప్రతిలోని చిత్రాలను గమనించి, దాని అసలైన స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అర్థం చేసుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరు ఉండాలో నిర్ణయించేది కేవలం ఓటర్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ పుస్తకాన్ని జేబులో పెట్టుకుని సభల్లో, బయట ప్రదర్శిస్తున్న వారు ముందుగా పార్లమెంట్ లైబ్రరీకి వెళ్లి ఆ రాజ్యాంగాన్ని కనీసం 15 నిమిషాల పాటు చదివి అర్థం చేసుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్‌లో చర్చలకు బదులుగా వీధుల్లో చర్చలు కోరడం సరికాదని, రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన ఆరోపించారు.