రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు : బ్రిడ్జ్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన
మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : భారత రాజ్యాంగ విశిష్టత,ప్రజాస్వామ్య విలువలు,ఎన్నికల వ్యవస్థలో భారత ఎన్నికల సంఘం పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రిడ్జ్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో మదనపల్లిలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు.విశ్రాంత డీజీపీ,ఐపీఎస్ అధికారి రాధాకృష్ణ నేతృత్వంలో కొనసాగుతున్న బ్రిడ్జ్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల,ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఈ పోటీలు నిర్వహించారు.ది రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే అంశంపై విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచనలను వ్యాసాల రూపంలో వ్యక్తపరిచారు.సొసైటీ ప్రధాన కార్యదర్శి వి.ముని వెంకటప్ప,ఉప కార్యదర్శి వై.ఎర్రయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.గత రెండేళ్లుగా బ్రిడ్జ్ ఇండియా సొసైటీ విద్యార్థుల్లో సృజనాత్మకత,సామాజిక స్పృహ,ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు పలు విద్యా,అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి,ఉపాధ్యాయ బృందం హాజరై పోటీల నిర్వహణకు సహకరించారు.సొసైటీ సభ్యులు బీసీ రెడ్డి,సహదేవ,రామలింగప్పతోపాటు ఏబీఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.నరసింహులు పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో అతిథులు,సొసైటీ సభ్యులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.రాజ్యాంగ స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపడంతోపాటు బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
రిపోర్టర్ : నానబాల కుమార్,మదనపల్లి రూరల్