తిరుపతయ్య పాదయాత్రకు కేసీఆర్ అభినందన
*---ఐదు రోజుల్లో 240కిలోమీటర్లు నడిచి కేసీఆర్ చెంతకు చేరిన బీఆర్ఎస్ నేత.*
నవాబుపేట సూర్య న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంఅధికారంలోకి రావాలని,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ మండల పరిధిలోని దయాపంతులపల్లి గ్రామ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు గండు తిరుపతయ్య చేపట్టిన పాదయాత్ర శుక్రవారం విజయవంతంగా ముగిసింది.ఐదు రోజుల పాటు సుమారు 240కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న తిరుపతయ్య ఆయనను కలిసి తన ఆకాంక్షను తెలియజేశారు.ఈ సందర్భంగా తిరుపతయ్య పట్టుదలను,పార్టీ పట్ల ఆయనకున్న అభిమానాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించి శాలువాతో సన్మానించారు.మండలంలోని పర్వతాపూర్ మైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఐదు రోజుల క్రితం(ఈనెల 23వ తేదీన)తిరుపతయ్య తన పాదయాత్రను ప్రారంభించారు.కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని,మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాలని,మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తిరిగి ఎంపీగా ఎన్నిక కావాలని ఆకాంక్షిస్తూ ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.ఎండనక,వాననక,అలసటను లెక్కచేయకుండా ఐదు రోజుల పాటు నిరంతరంగా అడుగులు వేస్తూ సుమారు 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎర్రవెల్లికి చేరుకున్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ తిరుపతయ్యను ఆప్యాయంగా పలకరించి పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఐదు రోజుల పాటు ఇంత సుదీర్ఘ దూరం నడిచి తనను కలవడానికి రావడం పట్ల ప్రత్యేకంగా అభినందించారు.ఆయన ఆరోగ్య పరిస్థితి,ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులు,యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం తిరుపతయ్యను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.దీంతో తిరుపతయ్య ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో కేసీఆర్ పాలనలో రైతుబంధు,సాగునీరు,వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ అందేవని గుర్తుచేశారు.ప్రస్తుతం రైతుబంధు అందకపోవడంతో పాటు నీళ్లు,కరెంటు సమస్యల కారణంగా తనకున్న మూడు ఎకరాల పొలం కూడా ఎండిపోయిందని తెలిపారు. రైతుల కష్టాలు తొలగి,వ్యవసాయ రంగం మళ్లీ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.ఆయన నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో పయనిస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.*నాయకులు,కార్యకర్తల సంఘీభావం* తిరుపతయ్య చేపట్టిన పాదయాత్రకు మండల బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.ఐదు రోజుల పాటు 240 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తన అభిమాన నాయకుడిని కలుసుకోవడం,కేసీఆర్ చేతుల మీదుగా అభినందనలు,సన్మానం అందుకోవడంతో తిరుపతయ్య పాదయాత్రకు ప్రత్యేక గుర్తింపు లభించింది.ఆయన చేపట్టిన ఈ ప్రయాణం నవాబుపేట మండల బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని కలిగించిందని,మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మాడెమోని నరసింహులు,మాజీ జెడ్పిటిసి ముత్యాల రవీందర్ రెడ్డిలు పేర్కొన్నారు.శుక్రవారం ఎర్రవెల్లిలో కేసీఆర్ను కలిసిన వారిలో మండల మాజీ ఎంపీపీ శ్రీనివాస్,మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ చందర్ నాయక్,యువజన అధ్యక్షుడు మెండే శ్రీను,కొండాపూర్ సర్పంచ్ రాఘవేందర్,కొల్లూరు రఘుగౌడ్,నరేష్,రాఘవేందర్ రెడ్డి,జక్కని మహేష్,వడ్డె శేఖర్,బాలరాజు,గొల్ల కేశవులు తదితరులు ఉన్నారు.