*పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి* - కిమ్స్ కడల్స్ కర్నూలు ఆధ్వర్యంలో ప్రత్యేక వర్క్‌షాపులు - సుమారు 80 మంది పీడియాట్రిషియన్లకు ఆధునిక డయాగ్నస్టిక్, చికిత్సా విధానాలపై శిక్షణ
కర్నూలు, నవంబర్ 27, 2026:* పిల్లల ఆరోగ్య సమస్యలను మరింత త్వరగా, కచ్చితంగా గుర్తించి మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు ఎప్పటికప్పుడు ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కిమ్స్ కడల్స్, కర్నూలు సీనియర్ పీడియాట్రిషియన్, చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ సుధాకర్ అన్నారు. వైద్య రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, చికిత్సా విధానాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వైద్యులకు నిరంతర శిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఏపీ పెడికాన్ లో భాగంగా కిమ్స్ కడల్స్ కర్నూలు ఆధ్వర్యంలో పిల్లల వైద్యానికి సంబంధించిన రెండు ప్రత్యేక వర్క్‌షాపులను నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 80 మంది పీడియాట్రిషియన్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ.. చిన్నారుల్లో అలర్జీ, ఆస్తమా సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ప్రారంభ దశలోనే గుర్తించడం, సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, తగిన చికిత్స అందించడం చాలా ముఖ్యమన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని మొదటి వర్క్‌షాప్‌ను ‘అలర్జీ మరియు అస్తమా’ అనే అంశంపై నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో చిన్నారుల్లో అలర్జీ, ఆస్తమా వ్యాధుల నిర్ధారణ, ఆధునిక చికిత్సా విధానాలు, అధునాతన డయాగ్నస్టిక్ పరీక్షలపై నిపుణులు వివరించారని చెప్పారు. తాజా వైద్య విధానాలను క్లినికల్ ప్రాక్టీస్‌లో ఎలా ఉపయోగించుకోవచ్చో వైద్యులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.
రెండవ వర్క్‌షాప్‌ను ‘పిల్లల వైద్యంలో పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్’ అంశంపై నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో పీడియాట్రిక్ ఎకో, లంగ్ అల్ట్రాసౌండ్, న్యూరోసోనోగ్రఫీ వంటి కీలక అంశాలపై వైద్యులకు ప్రాక్టికల్ శిక్షణ అందించినట్లు వివరించారు. ముఖ్యంగా చిన్నారుల్లో అత్యవసర, క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు బెడ్‌సైడ్ అల్ట్రాసౌండ్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని వేగంగా అంచనా వేయడం, తదనుగుణంగా చికిత్స నిర్ణయాలు తీసుకోవడంలో ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ రెండు వర్క్‌షాపుల్లో కేవలం సైద్ధాంతిక అంశాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్లు, కేస్ ఆధారిత చర్చలు కూడా నిర్వహించినట్లు డాక్టర్ సుధాకర్ తెలిపారు. దీనివల్ల వైద్యులు నూతన డయాగ్నస్టిక్ టెక్నిక్స్‌ను ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం కలిగిందన్నారు.
వైద్యుల మధ్య విజ్ఞానాన్ని, అనుభవాలను పంచుకోవడానికి ఏపీ పెడికాన్ వంటి అకడమిక్ వేదికలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా వైద్య నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, చిన్నారులకు మరింత నాణ్యమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు.
కర్నూలులో ఈ రెండు ప్రత్యేక వర్క్‌షాపులకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 80 మంది పీడియాట్రిషియన్లు హాజరుకావడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులోనూ వైద్యులకు ఉపయోగపడే ఇటువంటి శిక్షణ, విజ్ఞాన కార్యక్రమాలను నిర్వహించేందుకు కిమ్స్ కడల్స్ కృషి చేస్తుందని డాక్టర్ సుధాకర్ వెల్లడించారు.