అఖండ వైభవంగా శ్రీ కేదారేశ్వర స్వామి కల్యాణం 300 మంది మాలధారులకు అన్నప్రసాద వితరణ తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం
వెల్దుర్తి, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన వెల్దుర్తిలో వెలసిన శ్రీ గౌరీ సమేత కేదారేశ్వర స్వామి వార్ల కల్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం, శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ కల్యాణ క్రతువు కన్నులపండువగా జరిగింది.దాతలు సాయిరాం, ప్రవీణ్, హరిచందన, రమేశ్ యాదవ్, రమాదేవి, హరీష్, స్వరూపలు బహూకరించిన శివపార్వతుల ఉత్సవ మూర్తులకు కల్యాణం జరిపించారు. అనంతరం వారి చేతుల మీదుగానే భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో హైదరాబాద్ నుంచి మహాపాదయాత్రగా వచ్చిన 60 మంది అయ్యప్ప స్వాములు సహా స్థానిక అయ్యప్ప (60), ఆంజనేయ (100), శివ (70), భవానీ (25) మాలధారులు, సుమారు 250 మంది భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్ల ఆశీర్వచనాలు అందుకున్నారు.ఆలయ కమిటీ సేవలకు ప్రశంసలు: పాదయాత్రగా వెళ్తున్న తమకు ఆలయ కమిటీ చేసిన మర్యాదలు, ఉచిత మినరల్ వాటర్, పెరుగు, అన్నప్రసాద వితరణ, ఇతర వసతుల పట్ల హైదరాబాద్ గురుస్వాములు, అయ్యప్ప మాలధారులు హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసిన వసతులపై కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బొమ్మన సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యక్షులు వాల్మీకి గోపీనాథ్ నాయుడు, ప్రధాన కార్యదర్శి వడ్డే చిరంజీవి, కోశాధికారి యార్లపాటి శ్రీధర్ శర్మ, కార్యదర్శి బెస్తా మధు తదితరులు పాల్గొన్నారు.