అర్జా శ్రీకాంత్ కు టీటీడీ అరుదైన గౌరవం
ఎం. గణేష్ , సూర్య ఏపీ స్టేట్ బ్యూరో:న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అరుదైన గౌరవంతో పాటు కీలక బాధ్యతలు అప్పగించింది. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోని టీటీడీ ఆలయాల ప్రత్యేక అధికారిగా ఆయనను నియమించింది. ఈ నియామకంతో ఢిల్లీ, కురుక్షేత్ర, రిషికేశ్, జమ్మూలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాల పరిపాలన, అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయన చేపట్టనున్నారు. అస్సాం, ఉత్తరప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో టీటీడీకి సంబంధించిన కార్యకలాపాలను కూడా సమన్వయం చేయనున్నారు.
ఈ బాధ్యతల్లో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయా ఆలయాలను ప్రత్యక్షంగా సందర్శించి తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆలయాల నిర్వహణలో లోపాలు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. క్షేత్రస్థాయి పర్యటనల అనంతరం ప్రతి పక్షం రోజులకు ఒకసారి సమగ్ర నివేదికలను టీటీడీ ఉన్నతాధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆలయాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లయింది.
ఆలయాల్లో ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా నిత్య కైంకర్యాలు, వివిధ సేవలు, ఉత్సవాలు నిర్వహించేలా ఆయన పర్యవేక్షించనున్నారు. తాజా పూల సరఫరా, ప్రసాదాల పంపిణీ, భక్తులకు సులభతర దర్శనం, క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, శ్రీవారి సేవకుల సేవలను సమర్థంగా వినియోగించుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
అన్నదాన కార్యక్రమాల్లో నాణ్యత, పరిశుభ్రత పాటించడం, ధర్మప్రచార కార్యక్రమాలను విస్తృతం చేయడం, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, ఈఆర్పీ నిబంధనల అమలు, హుండీ పర్యవేక్షణ వంటి అంశాలను కూడా సమీక్షించనున్నారు. ఆలయాల ఆస్తుల పరిరక్షణ, భవనాల మరమ్మతులు, టెండర్ల నిర్వహణతో పాటు వార్షిక ఉత్సవాలకు సంబంధించిన ప్రతిపాదనలను కనీసం మూడు నెలల ముందుగానే సిద్ధం చేసి అనుమతులు పొందేలా చర్యలు తీసుకోనున్నారు.
ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోని టీటీడీ ఆలయాలన్నింటిలో ఒకే తరహా పరిపాలనా ప్రమాణాలను అమలు చేయడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ఈ నియామకం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆలయాల అభివృద్ధి, నిర్వహణను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అర్జా శ్రీకాంత్‌పై ఉంది.
విశేష అనుభవం.. ఎన్నో కీలక బాధ్యతలు
డాక్టర్ అర్జా శ్రీకాంత్ భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌కు చెందిన 1986 బ్యాచ్ విశ్రాంత అధికారి. రైల్వే శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పరిపాలనా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. రైల్వే శాఖ నుంచి పదవీ విరమణ అనంతరం 2025 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా రెండేళ్ల కాలానికి నియమించింది.
రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై పనిచేసిన సమయంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. రవాణా, రహదారులు, భవనాల శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా, సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా, రాష్ట్ర కోవిడ్-19 నోడల్ అధికారిగా సేవలందించారు.
కేంద్ర ప్రభుత్వంలోనూ విశేష సేవలు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీలో ఇంధన రవాణా విభాగం కార్యనిర్వాహక సంచాలకుడిగా, రైల్వే మంత్రిత్వ శాఖలో ట్రాఫిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. భారీ పరిశ్రమలు, ఉక్కు, బొగ్గు, గనుల శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రుల వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సివిల్ సర్వీసుల్లోకి రాకముందు నాబార్డ్‌లో ప్రాజెక్టు అభివృద్ధి మేనేజర్‌గా పనిచేశారు. భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ శిక్షణలో బంగారు పతకాన్ని అందుకున్నారు.
పెదకళ్లేపల్లి నుంచి ఉన్నత స్థాయికి
కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి ఆయన స్వస్థలం. ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ నుంచి వ్యవసాయ శాస్త్రంలో ఎం.ఎస్సీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాంస్కృతిక పర్యాటక రంగ మార్కెటింగ్‌పై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. జర్నలిజం, మార్కెటింగ్ నిర్వహణలో పీజీ డిప్లొమాలు కూడా పొందారు.
రచనలు.. సామాజిక కార్యక్రమాలు
పరిపాలనా బాధ్యతలతో పాటు రచనలు, సామాజిక, ప్రజా ప్రయోజన కార్యక్రమాల్లోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఆధ్వర్యంలో ప్రసాద్స్ ఐమ్యాక్స్, సెంట్రల్ మాల్, స్నో వరల్డ్, నెక్లెస్ రోడ్ వాటర్‌ఫ్రంట్ వంటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నట్లు ఆయన అధికారిక వెబ్సైట్ అర్జా సోషల్ పర్స్పెక్టివ్స్లో పేర్కొన్నారు. వివిధ రంగాల్లో ఆయనకు ఉన్న అనుభవం, పరిపాలనా దక్షత ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోని టీటీడీ ఆలయాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడనున్నాయని భావిస్తున్నారు.