కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది..
నల్గొండ: కృష్ణా జలాల విషయంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని, అయితే తెలంగాణ ప్రయోజనాలకు ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ అన్యాయం చేయబోమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) మల్లికార్జున్ నిర్లక్ష్యం వల్లే ఆంధ్రా ప్రాంతంలో పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మాణం జరిగిందని ఆరోపించారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిని సాగర్ ఎస్ఈగా కొనసాగించడం తమ ప్రభుత్వం చేసిన పొరపాటని అంగీకరించిన మంత్రి, వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని మల్లికార్జున్‌ను హెచ్చరించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేసిన కోమటిరెడ్డి, అధికార పార్టీపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తూ.. ఎస్ఎల్బీసీ (SLBC) సొరంగ మార్గం పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా పక్కన పెట్టారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.