హైదరాబాద్ మేజర్ న్యూస్ ( సిటీ ప్రతినిధి):భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) సందర్భంగా గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పాల్గొని రాజ్యాంగ ప్రవేశికను చదివి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటామని, రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తామని అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను గౌరవించడంతోపాటు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను ఆచరణలో కొనసాగించడమే రాజ్యాంగానికి ఇచ్చే నిజమైన గౌరవం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డైరెక్టర్(పర్సనల్) మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, డైరెక్టర్ (ఆపరేషన్స్) కిరణ్ కుమార్, డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీనివాస్, సీజీఎంలు, జీఎంలు, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.