హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : ఎల్నినో కరువు సాయం లో రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు బి కొండల్ రెడ్డి, శ్రీహరి తన్నీరు, విస్సా కిరణ్ కుమార్ లతో కలిసి ఆయన మాట్లాడారు. కౌలు రైతుల గుర్తింపుకు క్యాబినెట్ కమిటీ వేసి మూడు నెలలు అయినా ఒక్క సమావేశం జరగలేదన్నారు. 22 లక్షల మంది కౌలు రైతులు రాష్ట్రంలో ఉన్నారన్నారు. వీరి గుర్తింపు సర్వేపై ప్రభుత్వం తగిన ఆసక్తి చూపడం లేదన్నారు. నిర్దిష్ట గైడ్లైన్స్, పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసి సర్వే జరపాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచిన వీరి పట్ల మౌనంగానే ఉందని ఆవేదన చెందారు. సర్వే పూర్తయినా కూడా మిగిలిన కౌలు రైతులను కలిపి గుర్తించాలన్నారు. ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత బహుజన ఫ్రంట్ నేతలు శంకర్ ,తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ నేతలు ఏ కవిత, కే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.