మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు.. యువతకు సీఐ కిరణ్ పిలుపు
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ సూచించారు. శుక్రవారం ఎదులాబాద్‌లోని మేఘా ఇంజినీరింగ్ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన సీఐ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలై జీవిత లక్ష్యాలను దూరం చేసుకోవద్దని, చదువుపై దృష్టి సారించి క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, సమాజంలో మార్పు తీసుకొచ్చే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం జరిగినట్లు తెలిస్తే వెంటనే 112 లేదా 1903కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.