telangana
కల్వకుంట్ల కవిత చిత్రపటానికి పాలాభిషేకం
సూర్య, ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిరక్షించేందుకు టిఆర్‌ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత రూ.1.30 లక్షలు యూనివర్సిటీకి చెల్లించడంతో హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఎల్లారెడ్డిపేటలో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కదిరే భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మూసివేయాలనే ప్రభుత్వ ఆలోచనను కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకెళ్లగా, ఆమె తక్షణమే స్పందించారని తెలిపారు. ప్రజలు పోరాడి సాధించుకున్న డిగ్రీ కళాశాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో యూనివర్సిటీకి రూ.1.30 లక్షలు చెల్లించి తన వంతు సహకారం అందించారని పేర్కొన్నారు. కళాశాల పరిరక్షణకు ముందుకు వచ్చిన కవితకు కృతజ్ఞతలు తెలుపుతూ మండల టిఆర్‌ఎస్ నాయకులు, యువజన నాయకులు, మహిళా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ లాల్ మహమ్మద్, యువజన నాయకుడు సయ్యద్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.