దేశానికే ఆదర్శంగా తెలంగాణ భూ రీసర్వే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో భూసమస్యలు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా చేపడుతున్న సమగ్ర భూ రీసర్వే దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని శాస్త్రీయంగా సర్వే చేసి, భూ వివాదాలకు ముగింపు పలకడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రానున్న ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే పూర్తి చేసి రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. శుక్రవారం నాడు సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ మొదటి విడతలో జిల్లాకు 70 గ్రామాల చొప్పున నక్షాలేని 373 గ్రామాల్లో రీసర్వే చేపట్టామని ఈ సర్వేను డిసెంబర్ చివరినాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిన్నర కాలంలో ప్రతి అంగుళం భూమిని సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి స్థానిక ప్రజాప్రతినిధులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఒక్కో సమావేశంలో నాలుగు నుంచి ఆరు గంటలపాటు చర్చించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, భూ విస్తీర్ణంలో తేడాలు, సరిహద్దు వివాదాలు, రైతుల అభ్యంతరాలను తెలుసుకున్నామని చెప్పారు.
సర్వే సమయంలో భూమి విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు ఉన్న ప్రాంతాల్లో రైతుల మధ్య వివాదాలు తలెత్తకుండా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యక్షంగా పాల్గొని పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. అవసరమైన చోట మధ్యవర్తిత్వం ద్వారా ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని, ప్రైవేటు భూ వివాదాల్లో ప్రభుత్వం ఏకపక్షంగా జోక్యం చేసుకోకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశాలను మాత్రం ప్రభుత్వ రికార్డుల ప్రకారం పరిష్కరిస్తామని చెప్పారు.
సర్వే నిర్వహించే గ్రామాల్లో ముందుగానే ప్రజలకు చాటింపు ద్వారా సమాచారం అందిస్తామని, సర్వే పూర్తయిన అనంతరం భూ యజమానులకు వారి భూమి విస్తీర్ణం తెలియజేసి అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని వివరించారు. రైతులు సమర్పించే అభ్యంతరాలను విచారించి న్యాయం ఉన్నచోట తగిన సవరణలు చేస్తామని తెలిపారు. సర్వే ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాటర్‌ప్రూఫ్ పాస్ పుస్తకాలు.. క్యూఆర్ కోడ్‌తో పూర్తి భూ వివరాలు
సమగ్ర భూ రీసర్వే పూర్తయిన అనంతరం రైతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పాస్ పుస్తకాలను ఉచితంగా అందిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ పాస్ పుస్తకాలు వాటర్‌ప్రూఫ్‌తో పాటు చిరిగిపోకుండా మన్నికైన విధంగా రూపొందిస్తామని చెప్పారు. పాస్ పుస్తకంపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, దానిని స్కాన్ చేయగానే సంబంధిత భూమి సర్వే నంబర్, విస్తీర్ణం, ల్యాండ్ పార్సెల్ మ్యాప్ తదితర వివరాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
ప్రతి భూ యజమానికి సంబంధించిన భూముల వివరాలను మ్యాపింగ్‌తో అనుసంధానం చేస్తామని, ఒకే పాస్ పుస్తకంలో వివిధ సర్వే నంబర్లు, పార్సెల్స్‌కు సంబంధించిన వివరాలను ప్రత్యేక పేజీల్లో పొందుపరుస్తామని తెలిపారు.
వ్యవసాయ భూములకు, ఆబాదీ ఆస్తులకు వేర్వేరు పాస్ పుస్తకాలు
రాష్ట్రంలో వ్యవసాయ భూములతో పాటు గ్రామాల్లోని నివాస స్థలాలు, ఇళ్లు, ఆబాదీ ఆస్తులకు కూడా సమగ్ర సర్వే నిర్వహిస్తామని తెలిపారు. 100 గజాలు, 150 గజాలు లేదా 500 గజాలు ఇలా ఎంత విస్తీర్ణంలో నివాస స్థలం ఉన్నప్పటికీ మ్యాప్‌తో కూడిన ఆస్తి గుర్తింపు పత్రాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయ భూములకు ఒక రకమైన పాస్ పుస్తకం, ఆబాదీ ఆస్తులకు మరో రకమైన పాస్ పుస్తకం రెండు వేర్వేరు రంగుల్లో అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు.