తాంత్రిక పూజల పేరుతో రూ.50 లక్షల మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్
కీసర, మేజర్ న్యూస్: ప్రత్యేక పూజలు, తాంత్రిక ఆచారాలతో వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తామంటూ ఓ వ్యక్తిని నమ్మించి సుమారు రూ.50 లక్షలు మోసగించిన కేసులో ప్రధాన నిందితుడిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.25,02,500 నగదుతో పాటు బంగారు ఉంగరం, వెండి బిస్కెట్లు, ఏటీఎం కార్డు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను జవహర్‌నగర్ డివిజన్ ఏసీపీ ఎస్. చక్రపాణి శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్యేక పూజలు, తాంత్రిక ఆచారాల పేరుతో ఫిర్యాదుదారుడిని నమ్మించిన నిందితులు విడతలవారీగా సుమారు రూ.50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు కాళ్ల క్రాంతి కుమార్ అలియాస్ క్రాంతిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్ద నుంచి తొలుత రూ.2.50 లక్షల నగదు, 4.8 గ్రాముల బరువున్న విరిగిన బంగారు ఉంగరం, సుమారు 50 తులాల బరువున్న మూడు వెండి బిస్కెట్ ముక్కలు, ఫిర్యాదుదారుడికి చెందిన ఎస్‌బీఐ రూపే ఏటీఎం కార్డు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు రాంపల్లిలోని అతడి నివాసంలో తనిఖీలు నిర్వహించి అదనంగా రూ.22,52,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం రూ.25,02,500 నగదుతో పాటు బంగారం, వెండి, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ప్రధాన నిందితుడు క్రాంతి కుమార్‌ను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు రత్న (A2), పుట్టి సాయి (A3) పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదుదారుడు పేర్కొన్న రూ.50 లక్షల లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ.. ప్రత్యేక పూజలు, తాంత్రిక విద్యలు, చేతబడి, మంత్రతంత్రాలతో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి భారీ మొత్తంలో నగదు చెల్లించవద్దని సూచించారు. ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని లేదా డయల్ 100, 112కు సమాచారం అందించాలని కోరారు. మల్కాజిగిరి సీపీ, డీసీపీ ఆదేశాల మేరకు ఏసీపీ ఎస్. చక్రపాణి మార్గదర్శకత్వంలో కీసర ఇన్‌స్పెక్టర్ ఎన్. ఎలక్షన్ రెడ్డి, ఎస్‌ఐలు వి. వెంకట్ రెడ్డి, జి. రఘురాముడు, పోలీసు సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.