రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*
కర్నూలు, నవంబర్ 26: రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి అర్హులైన రైతులందరూ డిసెంబర్ మొదటి వారం లోపు పంటల బీమా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు.
గురువారం కలెక్టరేట్‌లో పంటల బీమా నమోదు ప్రక్రియ, పంటల వారీగా బీమా సదుపాయాలు, రైతులకు అవగాహన కల్పించే అంశాలపై ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్‌లో పప్పుశనగ, వేరుశనగ, జొన్న, ఉల్లి, వరి తదితర పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద బీమా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. టమోటా పంటకు కూడా నిర్దిష్ట మండలాలు, ప్రాంతాల వారీగా బీమా సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. పంటలు, మండలాల వారీగా బీమా వర్తించే వివరాలను రైతులకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా కూడా ఇంటి నుంచే ఉచితంగా ఆన్‌లైన్‌లో పంటల బీమా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు బీమా ప్రయోజనాలు, అర్హతలు, నమోదు విధానం, గడువుపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా సంబంధిత శాఖలు, ఇన్సూరెన్స్ కంపెనీలు సమన్వయంతో పనిచేసి, నిర్ణీత గడువులోగా గరిష్ట సంఖ్యలో రైతుల నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు ప్రశాంత్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.