పిరాట్లంక అభివృద్ధే కూటమి లక్ష్యం గ్రామ ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కమతం సాంబశివరావు
రేపల్లె మేజర్ న్యూస్; పిరాట్లంక గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని, గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచి గెలిపించాలని జనసేన పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త కమతం సాంబశివరావు పిలుపునిచ్చారు.
పిరాట్లంక గ్రామ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి కోట అశోక్ కుమార్, వార్డు సభ్యుల విజయమే లక్ష్యంగా గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కమతం సాంబశివరావు మద్దతుతో కూటమి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి తమ అభ్యర్థిత్వాన్ని వివరిస్తూ ఓటర్లను కలిశారు.ఈ సందర్భంగా కమతం మాట్లాడుతూ గ్రామాభివృద్ధి అనేది కేవలం హామీలకే పరిమితం కాకుండా, ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే పనుల ద్వారా ఆచరణలో చూపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. పిరాట్లంక గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని, గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ పిరాట్లంకను అభివృద్ధి బాటలో నడిపిస్తామని పేర్కొన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారంతో గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.
గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన మౌలిక వసతుల సాధన కోసం కూటమి సర్పంచ్ అభ్యర్థి కోట అశోక్ కుమార్‌తో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని కమతం సాంబశివరావు ఓటర్లను కోరారు.గ్రామ అభివృద్ధిని ప్రధాన అజెండాగా చేసుకుని సాగిన ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.