దేశ సాంస్కృతిక, సృజనాత్మక వైభవానికి వేదికగా గోవా ప్రాంగణం
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: గోవాలోని పనాజీలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం లేదా ఇఫ్ఫీ ప్రాంగణం కేవలం సినిమా ప్రదర్శనలకే పరిమితం కాకుండా, దేశంలోని సృజనాత్మకత, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే వేదికగా రూపుదిద్దుకుంది. సృజనాత్మక విద్యాసంస్థలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాంతీయ వంటకాలు, స్థానిక ఉత్పత్తులు, ప్రత్యేక స్మారక వస్తువులు, ఏర్పాట్ల సమాహారంతో ఈ ప్రాంగణం కళడిస్తోంది. చిత్ర ప్రదర్శనలతో పాటు దేశంలోని విభిన్న కళా, సాంస్కృతిక రంగాల తీరుతెన్నులను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశాన్ని ఇది ప్రతినిధులు, దర్శకులు, విద్యార్థులు, సందర్శకులకు కల్పిస్తోంది.
ప్రాంగణంలో ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న అంశాలలో సమ్మిళితత్వంపై అవగాహన కల్పిస్తున్న స్వయం సంస్థ కార్యక్రమం ఒకటి. చలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తుల గౌరవం, సమ్మిళిత భాగస్వామ్యం కోసం కృషి చేస్తున్న ఈ సంస్థ రెండోసారి ఇఫ్ఫీలో పాల్గొంటూ, అందరికీ అందుబాటులో ఉండే ప్రజా ప్రదేశాలు, సాంస్కృతిక కార్యకలాపాలలో దివ్యాంగుల భాగస్వామ్యం ఆవశ్యకతను చాటుతోంది. మహోత్సవ వేదిక వద్ద కల్పించిన సదుపాయాలకు తోడుగా ఈ చొరవ సాంస్కృతిక అనుభవాలను అందరికీ ఆహ్వానపూర్వకంగా మార్చడంలో తోడ్పడుతోంది.
మరోవైపు యానిమేషన్, డిజైన్ పోటీల నుంచి సాహిత్య సేకరణలు, నాగా సంప్రదాయ వంటకాలు, గోవా జీడిపప్పు వంటి స్థానిక రుచుల వరకు విభిన్న స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలు మహోత్సవ జ్ఞాపకాలు, సృజనాత్మక ఉత్పత్తులను అందిస్తుండగా, పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ వస్త్రధారణ, అనుబంధ వస్తువులను ప్రదర్శిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా కూడా తన ప్రత్యేక వస్తు శ్రేణిని ఇక్కడ పరిచయం చేస్తోంది.
మొత్తంగా విద్యాసంస్థలు, ప్రాంతీయ రుచులు, స్థానిక ఉత్పత్తులు, వినోద వేదికలు, సమ్మిళిత కార్యక్రమాల మేళవింపుతో ఇఫ్ఫీ ప్రాంగణం వెండితెరను మించిన విస్తృత సాంస్కృతిక అనుభూతిని అందిస్తోంది. విభిన్న రంగాల సంస్థలు, వేదికలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా యువత, కళాకారులు, ప్రేక్షకులకు భారత సృజనాత్మక రంగంలోని వైవిధ్యాన్ని దగ్గరగా చూసే అవకాశం లభిస్తోందని నిర్వాహకులు, సందర్శకులు అభిప్రాయపడుతున్నారు.