మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
సూర్య జాతీయ డెస్క్: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్యాకేజీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత ఏ రాష్ట్రానికీ లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తి తగ్గకుండా ఉండేలా, అన్ని రాష్ట్రాలకు లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం పెంచే సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లును ఆమోదించుకునేందుకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం లోక్‌సభ సమావేశం కానుండగా, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశమవుతుంది.
గత ఏప్రిల్ 17న లోక్‌సభలో రాజ్యాంగ 131వ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో ఆ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. నాడు బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు రావడంతో అవసరమైన 352 ఓట్ల మార్కుకు ప్రభుత్వం 54 ఓట్ల దూరంలో నిలిచిపోయింది. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు, పలు ప్రాంతీయ పార్టీల మద్దతు సంకేతాలతో కేంద్రం సవరించిన బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తి చేసింది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళనలను తొలగించేలా ప్రస్తుత నిష్పత్తిని కాపాడే ప్రతిపాదనలను పొందుపరిచినట్లు తెలుస్తోంది.
2023లో పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం, కొత్త జనాభా లెక్కలు, డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి రావాల్సి ఉంది. 2029 సాధారణ ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్న లక్ష్యంతో, తక్షణమే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. లోక్‌సభ ప్రస్తుత స్థానాల సంఖ్యను 543 నుంచి గరిష్ఠంగా 850 వరకు పెంచే ప్రతిపాదన ఈ ప్రక్రియలో భాగంగా ఉంది.
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభలలో హాజరై ఓటు వేసిన సభ్యులలో మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. ప్రస్తుత 540 మంది లోక్‌సభ సభ్యులలో అందరూ ఓటింగ్‌లో పాల్గొంటే ప్రభుత్వానికి కనీసం 360 నుంచి 361 ఓట్లు అవసరం అవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లుకు సానుకూలంగా స్పందిస్తుండటంతో, నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తి నెలకొంది.