సీజనల్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు తప్పవు* *విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సురక్షిత వసతి, మెరుగైన విద్యా సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి* *సీజనల్ హాస్టళ్ల నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*
కర్నూలు, నవంబర్ 27: జిల్లాలోని సీజనల్ హాస్టళ్ల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం, అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి తావివ్వకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత అధికారులను స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. విద్యార్థులకు అందించాల్సిన భోజనం, వసతి, విద్యా సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించినా, తప్పుడు బిల్లులు సమర్పించినా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శుక్రవారం కలెక్టరేట్ నుంచి సీజనల్ హాస్టళ్ల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో వలస కుటుంబాల పిల్లల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా, మధ్యలో చదువు మానివేయకుండా నిరంతర విద్యను అందించాలనే లక్ష్యంతో సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పటికీ వారి పిల్లలకు నాణ్యమైన విద్య, సురక్షిత వసతి, పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సీజనల్ హాస్టళ్లలో ఒక్కో కేంద్రంలో నిర్దేశించిన విధంగా 45 నుంచి 50 మంది విద్యార్థులకు వసతి కల్పించడంతో పాటు, వారికి రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం, సురక్షితమైన నిద్ర వసతి, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీరు తప్పనిసరిగా అందించాలన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక ట్యూషన్లు నిర్వహించాలని, పాఠశాలల్లో నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేయడంతో పాటు హోంవర్క్ పూర్తి చేయించేందుకు ప్రతిరోజూ రెండు గంటలపాటు నాణ్యమైన బోధన అందించాలన్నారు.
సీజనల్ హాస్టళ్ల నిర్వహణపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ అధికారుల ద్వారా నివేదికలు తెప్పించగా, కొన్ని కేంద్రాల్లో భోజనం, వసతి, విద్యా సదుపాయాల కల్పనలో లోపాలు ఉన్నట్లు, నివేదికలు అందాయని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులకు అందించాల్సిన సదుపాయాలను కల్పించకుండా తప్పుడు బిల్లులు సమర్పించడం తీవ్రమైన తప్పిదమని, ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
*వారం రోజుల్లో అన్ని లోపాలు సరిచేయాలి*
సీజనల్ హాస్టళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, వసతి గదులు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే గుర్తించి వారం రోజుల్లోగా మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. తాను స్వయంగా ఎప్పటికప్పుడు సీజనల్ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, సంబంధిత ఆర్డీవోలు కూడా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి హాస్టళ్ల నిర్వహణను పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం లేదా అవకతవకలు గుర్తిస్తే బాధ్యులపై క్రిమినల్ కేసులతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
*నాణ్యమైన భోజనం, విద్యా బోధనలో రాజీ వద్దు*
విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ట్యూషన్ల నిర్వహణకు అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించి, వారు తగిన దుస్తులతో హాజరై విద్యార్థులకు క్రమం తప్పకుండా బోధన అందించేలా చూడాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి వారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వలస వెళ్లిన సందర్భాల్లో పిల్లలకు అవసరమైన సంరక్షణ, భద్రత కల్పించాల్సిన పూర్తి బాధ్యత సంబంధిత SHGలు, NGOలదేనని స్పష్టం చేశారు. విద్యార్థులు రాత్రిపూట హాస్టల్లోనే బస చేయాల్సిన పరిస్థితి ఉంటే అందుకు అవసరమైన వసతులు తప్పనిసరిగా కల్పించాలన్నారు. విద్యార్థులు తమ తాతయ్య, అమ్మమ్మ లేదా ఇతర కుటుంబ సభ్యుల వద్ద ఉండాలనుకుంటే, సంబంధిత వివరాలను ధ్రువీకరించి, తగిన పరిశీలన అనంతరం మాత్రమే అనుమతించాలని సూచించారు.
*ప్రతిరోజూ జియో ట్యాగింగ్ ఫొటోలతో గూగుల్ షీట్ నిర్వహణ*
సీజనల్ హాస్టళ్లలో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా గూగుల్ షీట్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉదయం, సాయంత్రం విద్యార్థుల హాజరు, అల్పాహారం, భోజనం, ట్యూషన్ల నిర్వహణకు సంబంధించిన ఫొటోలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నారు. ఫొటోలన్నీ తేదీ, సమయం, ప్రదేశంతో కూడిన జియో ట్యాగింగ్‌తో స్పష్టంగా ఉండాలని సూచించారు. ఉదయం విద్యార్థుల హాజరు, అల్పాహారం తయారీ, వడ్డింపు, ట్యూషన్ల నిర్వహణకు సంబంధించిన ఫొటోలు, సాయంత్రం భోజనం, విద్యార్థులకు బోధన అందిస్తున్న దృశ్యాలను నిర్దేశిత సంఖ్యలో అప్లోడ్ చేయాలని తెలిపారు. విద్యార్థుల హాజరు పట్టికను కూడా ప్రతిరోజూ గూగుల్ షీట్లో తప్పనిసరిగా నమోదు చేయాలని, ఈ వివరాలను రోజువారీగా జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.
*అధికారుల నిరంతర పర్యవేక్షణ – బిల్లుల ఆడిట్*
మండల విద్యాశాఖ అధికారులు (MEOలు) సీజనల్ హాస్టళ్లను తరచూ సందర్శించి, విద్యార్థుల హాజరు, రిజిస్టర్లు, భోజన సదుపాయాలు, ట్యూషన్ల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. తనిఖీల సమయంలో రిజిస్టర్లలో తమ పరిశీలన వివరాలు, సూచనలు నమోదు చేయాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సీజనల్ హాస్టళ్లకు సంబంధించి సమర్పించే బిల్లులను జిల్లా ఆడిటర్ ద్వారా తనిఖీ చేయిస్తామని, నిధుల వినియోగంలో ఏవైనా అవకతవకలు, తప్పుడు బిల్లులు గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే SHGలపై బ్లాక్‌లిస్టింగ్ చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే వారికి అప్పగించిన నిర్వహణ బాధ్యతలను తొలగించి ప్రత్యామ్నాయ సంస్థలకు అప్పగిస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వ్యాపారంగా భావించకుండా, సామాజిక బాధ్యతగా తీసుకుని సేవాభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలనే కారణంగా చూపి వారికి నాణ్యమైన భోజనం, విద్య, వసతి కల్పనలో వివక్ష చూపకూడదన్నారు. పిల్లల పట్ల నిర్లక్ష్యం వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని, ప్రతి విద్యార్థిని సొంత బిడ్డగా భావించి సంరక్షించాలని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 13 మండలాల్లో ఏర్పాటు చేసిన 100 సీజనల్ హాస్టళ్ల అసలు లక్ష్యం నెరవేరేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, విద్యార్థుల చదువు నిరంతరాయంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకరాజు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రావు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, SHG సభ్యులు, NGO ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.