ఆలేరు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నియోజకవర్గ ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తనతో పోటీ పడుతూ,మంత్రుల వెంటపడి మరీ అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసించారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.శుక్రవారం ఆలేరు పట్టణంలోని ఏఎన్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి స్థానిక పాల శీతలీకరణ కేంద్రం నుంచి ఏఎన్ఆర్ గార్డెన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం నిర్వహించిన సభలో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారుఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీర్ల ఐలయ్యను 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే మంత్రివర్గంలో బీర్ల ఐలయ్యకు కూడా స్థానం లభించే అవకాశం ఉందని, ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నారని సభాముఖంగా ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, వివిధ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి గతంలో కృషి చేసిన మాజీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ ఆమె సేవలను అభినందించారు.ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో సుమారు రూ.2 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. మరో ఐదేళ్ల పాటు ప్రజా ప్రభుత్వమే కొనసాగుతుందనే ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో గంధమల్ల ప్రాజెక్టును నింపి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సుధగాని మల్లేష్, వైస్ చైర్మన్ ఎంఏ ఏజాస్ మాట్లాడుతూ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని, ఎలాంటి రాగద్వేషాలకు తావులేకుండా రైతుల సంక్షేమం, మార్కెట్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.అంతకుముందు గాయని సంధ్య, రాష్ట్ర సాంస్కృతిక బృంద సభ్యులు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.