కిషన్ రెడ్డిది ఎన్నికల యాత్ర.. షో పుటప్ డ్రామా!
తెలంగాణ బ్యూరో ప్రతినిధి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కేవలం ఎన్నికల యాత్ర మాత్రమేనని, ప్రజలను ఆకట్టుకునేందుకు చేస్తున్న షో పుటప్ యాత్ర అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టారని స్పష్టం చేశారు.
డ్రగ్స్, గంజాయి వ్యవహారంలో ఎంతటి పెద్ద వ్యక్తులున్నా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారని తెలిపారు. విద్యాసంస్థల్లోనూ గంజాయి వెలుగుచూసిన సందర్భాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని అరికట్టేందుకు నార్కోటిక్, ఈగల్ టీమ్‌ల ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. సినీ ప్రముఖులతో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు.
డ్రగ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉక్కుపాదం మోపిన తర్వాత కిషన్ రెడ్డి ఇప్పుడు పాదయాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డికి ఇప్పుడు కళ్లు తెరుచుకున్నాయా? అని ప్రశ్నించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సందీప్‌తో తాను ఎలాంటి రాజకీయ చర్చలు జరపలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గుర్తించి ప్రోత్సహించాలని సూచించినట్లు తెలిపారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు చేయాల్సిన పనుల్లో ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని పరిశీలించి పరిష్కరించేలా చూడాలని కోరినట్లు చెప్పారు. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ఫిర్యాదులు లేవని వెల్లడించారు.
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని జగ్గారెడ్డి అన్నారు. ప్రధాని పదవి అనేది రాహుల్ గాంధీ కుటుంబానికి కొత్త కాదని, బీజేపీ నాయకులకు పదవులు కొత్త కావొచ్చేమో కానీ కాంగ్రెస్ కుటుంబానికి కాదని వ్యాఖ్యానించారు.