వేరుశనగ పంటకు జిప్సం తప్పనిసరి ఏడీఏ వెంకటేశ్వర్లు సూచన
వెల్దుర్తి, మేజర్ న్యూస్: వేరుశనగ పంటకు పూత దశలో ఎకరాకు 200 కిలోల చొప్పున జిప్సం వేయడం వల్ల గింజలో నూనె శాతం, పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని కర్నూలు ఏడీఏ (డీఆర్‌సీ) వెంకటేశ్వర్లు అన్నారు. ‘ఖేతి బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని బోగోలు, గోవర్ధనగిరి, శ్రీరంగాపురం, సూదేపల్లి గ్రామాల్లో కంది, వేరుశనగ పంట పొలాలను ఆయన పరిశీలించారు.బోగోలులో జాతీయ వంటనూనెలు, నూనెగింజల మిషన్ పథకం కింద సామూహిక ప్రదర్శన క్షేత్రాల్లో సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించి రైతులకు సలహాలు ఇచ్చారు.కంది పంటకు పిండినల్లి ఆశించడాన్ని గుర్తించి నివారణ చర్యలను వివరించారు. కాలానికి అనుగుణంగా బెట్టను తట్టుకునే కంది వంగడాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్)’ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. క్యూఆర్ కోడ్ ద్వారా కేటాయించిన దుకాణాల్లో రాయితీపై ఎరువులు పొందే విధానాన్ని వారి చరవాణుల్లో చూపిస్తూ వివరించారు. దీనివల్ల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు.కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్.అక్బర్ బాషా, ఏఈఓ అజయ్ భార్గవ్, రైతు సేవా కేంద్రం సిబ్బంది మధు, వెంకటేశ్వర్లు, జగదీష్, లింగన్న, రైతులు పాల్గొన్నారు.