పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం
తోటి ఉద్యోగి కష్టానికి చలించి రూ.53 వేల విరాళం
గాజువాక, నవంబర్ 27, మేజర్ న్యూస్ : ఆపదలో ఉన్న తోటి ఉద్యోగి కుటుంబానికి మేమున్నామంటూ గాజువాక పోలీసులు ఉదారత చాటుకున్నారు. విశాఖ నగర టూటౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మహిళా హెడ్ కానిస్టేబుల్‌గా (2009 బ్యాచ్) విధులు నిర్వహిస్తున్న సుస్సన్నకు ఇటీవల నెలలు నిండకముందే బిడ్డ జన్మించింది. ప్రస్తుతం ఆ పసికందు మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారి వైద్యానికి సుమారు రూ.18 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
విషయం తెలుసుకున్న గాజువాక పోలీస్ స్టేషన్ సిబ్బంది మానవతా దృక్పథంతో స్పందించారు. శాంతిభద్రతల విభాగం సిబ్బంది రూ.43 వేలు, క్రైమ్ విభాగం సిబ్బంది రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.53 వేల ఆర్థిక సాయాన్ని సమీకరించారు. ఈ నగదును గాజువాక సీఐ వాసునాయుడు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. విధి నిర్వహణలోనే కాకుండా తోటి సిబ్బంది కష్టసుఖాల్లోనూ అండగా నిలుస్తామని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చిన్నారి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని వారంతా ఆకాంక్షించారు.
రిపోర్టర్: పీ.కోటిరెడ్డి, గాజువాక ఇంచార్జ్, విశాఖపట్నం