telangana
ఆర్పీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : మెప్మా పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ (ఆర్పి ) లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఆర్పీల యూనియన్ అధ్యక్షురాలు మానుకోట సునీత డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో వర్కింగ్ ప్రెసిడెంట్ దొండి స్వర్ణలత, ఉపాధ్యక్షులు ధనలక్ష్మి, హంస లతో కలిసి ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి చెందిన 48 రకాల సేవలు చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని అన్నారు. విఏవోల మాదిరి తమకు కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనం చెల్లించాలన్నారు. తమను వేెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పిస్తూ, అధికారుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, వేధింపులను అరికట్టాలని కోరారు. ఎలాంటి షరతులు లేకుండా 6 వేల మంది ఆర్పీలకు రూ. 10 లక్షల ఆరోగ్య భీమా,రూ. 20 లక్షల ప్రమాద బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్పీలందరికీ ఒకే విధమైన డ్రెస్ కూడా అమలు చేయాలని సూచించారు. నెల రోజుల్లో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్పీలను ఐక్యం చేసి సమ్మె బాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో కోశాధికారి జహార, ఉపాధ్యక్షులు అరుణ, సునీత, సుభద్ర, సహాయ కార్యదర్శి వసంత తదితరులు పాల్గొన్నారు