వారణాసిలో నవంబర్ 28న కాశీ తమిళ సంగమం 5.0 ప్రారంభం
సూర్య జాతీయ డెస్క్: కాశీ తమిళ సంగమం ఐదవ ఎడిషన్‌ను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శనివారం వారణాసిలో ప్రారంభించనున్నారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు జరగనున్న ఈ కార్యక్రమ ముగింపు వేడుకల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు. తమిళనాడు మరియు కాశీ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక, భాషా, నాగరిక బంధాలను చాటిచెప్పేందుకు ఈ వేడుకలో 1,400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో రూపొందిన ఈ కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు.
ఈ ఎడిషన్ తిరుక్కురళ్ పైలవోమ్ – తిరుక్కురళ్ అభ్యాస్ కరేన్ అనే ఇతివృత్తంతో సాగనుంది. ప్రముఖ తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ రచించిన తిరుక్కురళ్‌లోని 1,330 సూక్తులలో నైతికత, పాలన, మానవ సంబంధాలు, కరుణ, క్రమశిక్షణ వంటి అంశాలపై విద్యార్థులు, యువతలో అవగాహన పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా విభాగం, ఐఐటీ మద్రాస్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరియు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తమిళనాడు నుంచి వచ్చే సుమారు 1,400 మంది ప్రతినిధులను ఒక్కొక్కటి 200 మంది చొప్పున ఏడు బృందాలుగా విభజించి ఎనిమిది రోజుల యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో నాలుగు రోజుల ప్రయాణం, నాలుగు రోజుల సందర్శనలు మరియు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు మరియు మీడియా ప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులు, వృత్తి నిపుణులు మరియు కళాకారులు, మహిళలు, ఆధ్యాత్మిక వేత్తల వర్గాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, రామ్‌నగర్ కోట, భారత్ మాతా ఆలయం, గంగా హారతి, బీహెచ్‌యూ తమిళ విభాగంతో పాటు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం, అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని కూడా ప్రతినిధులు సందర్శించనున్నారు.
దేశవ్యాప్తంగా 1,000 ఉన్నత విద్యా సంస్థల భాగస్వామ్యంతో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, తిరుక్కురళ్‌పై పరిశోధన, అధ్యయనాలను ప్రోత్సహిస్తున్నారు. సాహిత్య వారసత్వం, సాంస్కృతిక మార్పిడి ద్వారా ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య అనుబంధాన్ని మరింత దృఢతరం చేయడమే కాశీ తమిళ సంగమం 5.0 ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు పేర్కొన్నారు.