కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్
సూర్య బిజినెస్ డెస్క్: కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నిరభ్యంతర పత్రం లభించింది. దేశీయ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ డెరివేటివ్స్ మార్కెట్ విస్తరణలో ఇది కీలక ముందడుగుగా నిలుస్తుందని గురువారం ఎక్స్ఛేంజ్ వర్గాలు వెల్లడించాయి. నియంత్రణ నిబంధనలకు లోబడి ఈ కాంట్రాక్టులను ప్రారంభించేందుకు ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఆమోదం లభించినట్లు ఎక్స్ఛేంజ్ తెలిపింది.
వడ్డీ రేట్లలో మార్పులు, క్రెడిట్ స్ప్రెడ్ల కదలికల వల్ల కార్పొరేట్ బాండ్ల విలువల్లో వచ్చే హెచ్చుతగ్గులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ కొత్త కాంట్రాక్టులు పారదర్శకమైన, ప్రామాణికమైన వేదికను అందిస్తాయి. వ్యక్తిగత సెక్యూరిటీలను పదేపదే మార్చాల్సిన అవసరం లేకుండానే మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియో స్థాయిలో రిస్క్‌ను హెడ్జ్ చేసుకునేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. అలాగే కార్పొరేట్ డెట్ మార్కెట్ గమనంపై అర్హత కలిగిన భాగస్వాములు స్పష్టమైన వ్యూహాలతో ముందుకు సాగేందుకు, పోర్ట్‌ఫోలియో నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ సాధనాలు తోడ్పడతాయని ఎక్స్ఛేంజ్ పేర్కొంది.
ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇతర ప్యాసివ్ డెట్ పెట్టుబడి సాధనాల వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ వాటికి అదనపు బలాన్ని చేకూరుస్తాయి. మార్కెట్ భాగస్వాములకు ఎక్స్ఛేంజ్ వేదిక ద్వారా బాండ్ల విలువ కదలికలపై సులభంగా వ్యవహరించే అవకాశం లభించడం వల్ల రుణ మార్కెట్ లోతు మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిబంధనలకు అనుగుణంగా కాంట్రాక్టుల ప్రారంభానికి అవసరమైన సాంకేతిక, కార్యాచరణ ఏర్పాట్లను పూర్తి చేస్తామని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. కాంట్రాక్టుల వివరాలు, ట్రేడింగ్ ప్రారంభమయ్యే తేదీని త్వరలోనే విడిగా ప్రకటిస్తామని ఎక్స్ఛేంజ్ తెలియజేసింది. రాబోయే రోజుల్లో ఈ కొత్త డెరివేటివ్ ఉత్పత్తితో బాండ్ మార్కెట్ భాగస్వాములకు కొత్త రిస్క్ నిర్వహణ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.