2025–26లో 253.81 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి
సూర్య జాతీయ డెస్క్: 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొత్తం 253.81 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి నమోదైందని బేసిక్ యానిమల్ హస్బెండ్రీ స్టాటిస్టిక్స్ 2026 నివేదిక వెల్లడించింది. జాతీయ పాల దినోత్సవం సందర్భంగా బీహార్‌లోని పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ఈ గణాంకాలను విడుదల చేశారు. 2025 మార్చి 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు నిర్వహించిన సమగ్ర నమూనా సర్వే ఆధారంగా పశుసంవర్ధక, పాడి పరిశ్రమ రంగాలకు సంబంధించిన కీలక ఉత్పత్తి అంచనాలను ఈ నివేదికలో పొందుపరిచారు.
పాడి ఉత్పత్తులతో పాటు గుడ్లు, మాంసం ఉత్పత్తిలోనూ దేశంలో గణనీయమైన గణాంకాలు నమోదయ్యాయి. తాజా నివేదిక ప్రకారం దేశంలో గుడ్ల ఉత్పత్తి 156.88 బిలియన్లుగా అంచనా వేశారు. అలాగే మొత్తం మాంసం ఉత్పత్తి 10.63 మిలియన్ టన్నులుగా ఉండగా, ఇందులో కోడి మాంసం వాటా 5.13 మిలియన్ టన్నులుగా నిలిచింది. పశుపోషణ, పౌల్ట్రీ రంగాల్లో రైతుల భాగస్వామ్యం, ఉత్పాదకత పెరుగుదల ఈ గణాంకాలకు దోహదపడ్డాయి.
జాతీయ పాల దినోత్సవ వేడుకల సందర్భంగా పాడి పరిశ్రమ, పశుసంవర్ధక మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. డెయిరీ సహకార సంఘాల కోసం డేటా ప్రాసెసింగ్, పాల సేకరణ యూనిట్లతో పాటు పాట్నా, ముజఫర్‌పూర్‌లలో మినరల్ మిక్చర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. సమస్తిపూర్‌లోని మిథిలా మిల్క్ యూనియన్‌లో ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను కూడా నెలకొల్పారు.
పాట్నాలోని బిహతా ప్రాంతంలోని సికందర్‌పూర్‌లో రోజుకు రెండు లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నమస్తే ఇండియా పాల ప్రాసెసింగ్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పాల సేకరణ, శీతలీకరణ, శుద్ధి వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా పాడి రైతులకు మెరుగైన ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ఈ మౌలిక వసతులను రూపొందించారు. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులను తట్టుకుంటూ పశుసంవర్ధక, పాడి రంగాన్ని మరింత సుస్థిరంగా తీర్చిదిద్దే దిశగా ఈ గణాంకాలు, ప్రాజెక్టులు కీలకంగా నిలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.