రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
- ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం
- వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
ప్రత్తిపాడు మేజర్ న్యూస్ : భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకోవాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు. రాచపల్లి గ్రామంలో వైసిపి నాయకులు బంకు శ్రీను ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిబాబు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిందని, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, గౌరవప్రదమైన జీవనం కల్పించిందన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా రాజ్యాంగ విలువలను గౌరవించాలని సూచించారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరుల బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తించాలని, లౌకికత్వం, జాతీయ సమైక్యత, సామాజిక న్యాయాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.