పంచమహాశక్తుల నేపథ్యంలో 'ఆది రుద్రాక్ష'.. తొలి గ్లింప్స్ విడుదల
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: పంచమహాశక్తులు, ఓ మహారహస్యం, దుష్టశక్తుల మధ్య సాగే పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆది రుద్రాక్ష తొలి గ్లింప్స్ తాజాగా విడుదలైంది. షేక్ మహబూబ్ బాషా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆర్యన్ హీరోగా నటిస్తూ, స్వయంగా కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో వేదికగా ఈ గ్లింప్స్‌ను చిత్ర బృందం ఘనంగా ఆవిష్కరించింది.
విడుదలైన గ్లింప్స్‌లో వినిపించిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ సినిమా కథా ప్రపంచాన్ని ఆసక్తికరంగా పరిచయం చేసింది. నాగ, గజ, వ్యాఘ్ర, మయూర వంటి శక్తుల ప్రస్తావనతో పాటు, యుగయుగాలుగా ఒక మహారహస్యానికి రక్షణగా నిలిచిన పంచరక్షకుల నేపథ్యాన్ని ఇందులో చూపించారు. ఆ రహస్యాన్ని చేజిక్కించుకోవాలని చూసే దుష్టశక్తులను అంతమొందించడానికి మహాదేవుని సంకల్పానికి ప్రతిరూపంగా ఓ మహావీరుడు రణరంగంలోకి దిగుతాడనే కథాంశంతో ఈ సినిమా సాగనుందని గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.
గ్లింప్స్ విడుదల సందర్భంగా హీరో, దర్శకుడు ఆర్యన్ మాట్లాడుతూ, కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున తమ సినిమా గ్లింప్స్ విడుదల కావడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రముఖ నటుడు విజయ్ ఆంటోని తమ గ్లింప్స్ చూసి అభినందించడం చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తామని ఆయన తెలిపారు.
ఈ చిత్రంలో రూప కథానాయికగా నటిస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్నారు. దర్శకుడు ఆర్యన్ రాసుకున్న కథపై స్పష్టత, అంకితభావం నచ్చి ఈ ప్రాజెక్ట్‌ను అత్యుత్తమ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నామని నిర్మాత షేక్ మహబూబ్ బాషా పేర్కొన్నారు. పరమశివుడి ఆశీస్సులతో ఈ పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేసింది.