రబీ పంట కాలంలో అపరాల పైర్లలో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణా కార్యక్రమం
పొన్నూరు మేజర్ న్యూస్ :-పొన్నూరు మండలం వడ్డీముక్కల గ్రామంలో రబీ పంట కాలంలో అపరాల పైర్లలో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం గుంటూరు జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి లాంఫామ్ సీనియర్ శాస్త్రవేత్త ఎం. గంగాదేవి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ..... వరి మాగాణుల్లో పెసర, మినుము వంటి అపరాల సాగు గురించి, భూసార పరిరక్షణ, ఎరువుల యాజమాన్యం గురించి ఆమె రైతులకు వివరించారు.రసాయనిక ఎరువులకు బదులుగా ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, రైజోబియం కల్చర్ తో విత్తన శుద్ధి చేసి అపరాలు విత్తుకోవాలని సూచించారు. అపరాల పైర్లలో పల్లాకు తెగులు వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని అన్నారు. వ్యవసాయ సహాయ సంచాలకులు పొన్నూరు డివిజన్ వి. రామకోటేశ్వరి మాట్లాడుతూ..... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరువుల యాప్ గురించి రైతులకు అవగాహన కల్పించారు. రైతులు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ద్వారా తమ సమీప డీలర్ వద్ద ఎరువులుపొందవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఐ. శ్రీకాంత్, విఏఏ టి. ప్రసాదు, ఎంపీఈవో ఎస్. సురేష్ బాబు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్