డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా; అడుగుపెడితే అరెస్ట్ చేస్తామన్న ప్రభుత్వం
న్యూఢిల్లీ / ఢాకా: రెండేళ్లకు పైగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, వచ్చే నెల డిసెంబర్ 16న (బంగ్లాదేశ్ విజయ దినోత్సవం) స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె అధికార ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ విమానంలోనే హసీనా భారత్‌కు వచ్చారని, రాజ్యాంగ విరుద్ధంగా బహిష్కరించబడిన ఆమెను తిరిగి ఢాకాకు తీసుకెళ్లేందుకు బంగ్లాదేశ్ జాతీయ విమాన సంస్థ 'బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్' విమానాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రద్దు చేసిన ఆమె పాస్‌పోర్ట్, ఇతర ప్రయాణ పత్రాలను కూడా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, హసీనా అభ్యర్థనను బంగ్లాదేశ్‌లోని తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్రంగా తోసిపుచ్చింది. ఆమె ఒక దోషి, పరారీలో ఉన్న నేరస్థురాలని విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ మండిపడ్డారు. హసీనా కోసం ప్రత్యేక విమానం పంపే ప్రసక్తే లేదని, అప్పగింత ఒప్పందం ప్రకారం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఖైదీగానే ఆమెను వెనక్కి తీసుకువస్తామని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన వెంటనే ఆమెను అరెస్ట్ చేసి, ఒక నేరస్థురాలిగా చట్టప్రకారం విచారిస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది. కాగా, 2024 విద్యార్థి ఉద్యమ అణచివేత కేసుల్లో బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ హసీనా గైర్హాజరీలో ఆమెకు ఇప్పటికే మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు, బంగ్లాదేశ్ అప్పగింత అభ్యర్థనపై భారత్ న్యాయపరమైన ప్రక్రియను పరిశీలిస్తుండగా, హసీనా తాజా ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.