రిగ్గింగ్ చేసినా.. ఓడిపోయిన చరిత్ర మీది మీడియాతో నగర మేయర్ సి.రమేష్ గౌడ్
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : రిగ్గింగ్ చేసినా ఓడిపోయినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానిది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతూ ఆస్కార్ అవార్డు మాదిరిగా ఊగిపోతూ, తూలిపోతూ, ఆవేశపడుతూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని నగర మేయర్ సి.రమేష్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి హయాంలో అనంతపురం నగరం ఎంత అభివృద్ధి చెందిందో ఓసారి గుర్తుంచుకోవాలన్నారు. ఒక జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి నాలుగు సార్లు ఎంపీ అయిన అనంత వెంకటరామిరెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టుకుని లుచ్చా, లోఫర్ అంటారా? ప్రజల అభిప్రాయాన్ని గౌరవించలేని విధంగా నువ్వు మాట్లాడే ప్రతి మాట యావత్ అనంతపురం జిల్లా బీజేపీ నాయకత్వం అంతా మాట్లాడినట్టే కదా?. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన కొనుకొండ్ల రాజేష్.. పోలింగ్ బూత్‌లోకి దూరి డోర్లు వేసి లోపల వ్యక్తులను పెట్టి రిగ్గింగ్ జరిపిస్తూ బయట కాపలాదారుడిగా ఉన్నది నిజం కాదా? అనంతపురంలో ఉదయం 7 గంటలకే ఒక ఓటు వేసి, మళ్లీ కూడేరు మండలం కడదరకుంట గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల్లో మరో ఓటు వేస్తావా? సిగ్గు లేదా? కొనకొండ్ల రాజేష్.. అని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మంత్రులు బూత్‌లలోకి వెళ్లి దాడులు చేయించారు. నా సహచరుల మోకాళ్లు, కాళ్లు, చేతులు విరిగి, తలలు పగిలి ఇప్పటికీ హాస్పిటల్‌లో ఉన్నారు. కౌంటింగ్ రోజు మాకు మెజారిటీ వస్తుంటే ఓర్చుకోలేక నాలుగు టేబుళ్ల కౌంటింగ్ ప్రక్రియను ఆపేసి తెల్లవారుజామున ఐదు గంటల వరకు అధికారులకు, మాకు, ఏజెంట్లకు నరకం చూపించారన్నారు.
ఆ రిగ్గింగులే జరగకపోయి ఉంటే, ఆ బూత్ క్యాప్చర్లు జరగకపోయి ఉంటే, కౌంటింగ్‌లో ఉన్న ఇన్‌వాలిడ్ ఓట్లు ఎక్కువ మావి తీసేయకపోయి ఉంటే 35వేలకు పైచిలుకు మెజారిటీ మాకు వచ్చేదన్నారు. కౌంటింగ్ రోజు 10వేల మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు రావడమే ప్రజల అభిప్రాయానికి నిదర్శనమన్నారు. ఓటమిని అంగీకరిస్తున్నామని మంత్రి సత్య కుమార్ ట్వీట్ చేసి, వైసీపీ అభ్యర్థికి కూడా శుభాకాంక్షలు తెలియజేసిన 10రోజుల తర్వాత ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు కోర్టుకు వెళ్తే బాగోతాలన్నీ, దౌర్జన్యాలన్నీ, సీసీ ఫుటేజీలు బయటకు వచ్చి మాకు ఇంకా ఎక్కువ న్యాయం జరుగుతుందని, ఇంకా ఎక్కువ మెజారిటీ తమకే వస్తుందన్నారు. గెలిచినా గర్వం ఉండకూడదని, ప్రజలకు అందుబాటులో ఉండి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అందరినీ కలుపుకొని మంచి పనులు చేయాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే ఎళ్లప్పుడూ ఉంటుందన్నారు. కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే అని విర్రవీగారు కదా.. ఈరోజు రండి, కలిసి పనిచేద్దాం. మీ మేనిఫెస్టోలో చెప్పిన విమానాశ్రయం తీసుకురండి, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ తీసుకురండి, రైల్వే జంక్షన్ తీసుకురండి, మొన్న మదనపల్లిలో ప్రారంభించినట్లు హార్టీకల్చర్ హబ్‌ను ఇక్కడికి తీసుకురండి అని నగర అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దామన్నారు. అలాగే పెద్దాయన జేసీ ప్రభాకర్‌రెడ్డి యువతను ప్రోత్సహిస్తూ, అధికారులను సహకరించమని చెప్తారని ఆశించాం.. కానీ ఆయన అలా మాట్లాడలేదు. పార్టీ మారమని ఆయన చెప్పినట్లు అట్లా పార్టీలు మారుకుంటూ పోతా ఉంటే ఇంకా ఒకటే పార్టీ మిగులుతుంది అంతే. ఇంకా ఏం పార్టీలు ఉండవన్నారు. ప్రజల అభిప్రాయాన్ని ఏ ఒక్కరైనా కచ్చితంగా గౌరవించి తీరాల్సిందే. అధికారులు సహకరించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మాకంటూ కొన్ని మార్గాలు ఉంటాయి.. అవి చేసి చూపిస్తాం. అనంతపురం నగర అభివృద్ధి కోసం కచ్చితంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మేయర్ సి.రమేష్ గౌడ్ స్పష్టం చేశారు.