ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ నా కెరీర్‌ను మార్చేసింది.. నితిన్ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ ఎమోషనల్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: విభిన్నమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న దర్శకుడు మురళీకాంత్ దేవసోత్, జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం నితిన్ కథానాయకుడిగా అలియాస్ రుక్మిణి చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన, ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో దండోరా సినిమా సమయంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మిస్తున్న అలియాస్ రుక్మిణి డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
గతంలో శివాజీ, నందు, నవదీప్ ప్రధాన పాత్రల్లో తాను తెరకెక్కించిన దండోరా చిత్రానికి మంచి కథాబలం ఉన్నప్పటికీ, ఆ సమయంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో సినిమాలోని అసలు విషయం పక్కకుపోయిందని మురళీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివాదం కారణంగా సినిమా బాగున్నా బయటకు వచ్చి మెచ్చుకోవడానికి సినీ వర్గాలు వెనుకాడాయని, దాంతో తనకు రావాల్సిన గుర్తింపు దక్కలేదని తెలిపారు. అయితే అలాంటి క్లిష్ట సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని, ఆ ట్వీట్ తర్వాతే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తనను పిలిచి అభినందించారని పేర్కొన్నారు.
అలియాస్ రుక్మిణి చిత్రంలో అఫియా సయ్యద్ కథానాయికగా నటించగా, హర్షవర్ధన్, సాయికుమార్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ సినిమాను ఇటీవల డిస్ట్రిబ్యూటర్లకు ప్రదర్శించగా అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో నితిన్ నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుందని అంటున్నారు.
వరుస పరాజయాల తర్వాత నితిన్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. భీష్మ తర్వాత ఆశించిన స్థాయిలో విజయం దక్కకపోవడంతో, అలియాస్ రుక్మిణి చిత్రంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ప్రీమియర్ షోల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో డిసెంబర్ 4న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read: పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు